Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 102 మంది ప్రపంచ కుబేరుల డిమాండ్
దావోస్: ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సు జరుగుతున్న దావోస్ నుంచి అసాధారణ లేఖ బహిర్గతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 102 మంది కుబేరులు తమ సంపదపై మరింత పన్ను విధించాలనీ, తద్వారా అసాధారణంగా పెరిగిపోయిన ఆర్థిక అసమానతలు తగ్గించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పన్ను విధానం ఏమంత న్యాయసమ్మతంగా లేదనీ, ఫలితంగా విశ్వాసం కోల్పోతోందని పేర్కొన్నారు. ''ప్రపంచం గత రెండేండ్లుగా తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. అయితే మహమ్మారి సమయంలోనూ మా సంపద గణనీయంగా పెరిగింది. పన్నుల్లో మా న్యాయమైన వాటాను చెల్లించగలమని చెప్పగలం'' అని ఆ లేఖలో ప్రపంచ సంపన్నులు పేర్కొన్నారు. ఈ కుబేరుల గ్రూపులో మూడు సంస్థలు ఉన్నాయి. ఇందులో ఒకటి అమెరికాకు చెందిన పాట్రియోటిక్ మిలియనీర్స్ కాగా, రెండోది జర్మనీకి చెందిన ట్యాక్స్ మి, డెన్మార్క్‌కు చెందిన మిలియనీర్స్ ఫర్ హ్యుమానిటీ మూడోది. గ్రూపు సభ్యుల్లో డిస్నీ వారసురాలు అబిగెయిల్ డిస్నీ, ఆమె సోదరుడు టిమ్ డిస్నీ, అమెజాన్ గత ఇన్వెస్టర్ అయిన నిక్ హనౌర్ కూడా ఉన్నారు. ఈ లేఖపై యూఎస్, యూకే, కెనడా, జర్మనీ తదితర తొమ్మిది దేశాలకు చెందిన వారు సంతకం చేశారు. ధనవంతులు పన్నుల్లో తమ న్యాయమైన వాటాను చెల్లించాలని అన్ని దేశాల ప్రభుత్వాలు డిమాండ్ చేయాలని ఆ లేఖలో కోరారు. 'ధనవంతులమైన మాపై పన్ను విధించండి.. ఇప్పుడే ఆ పని చేయండి'' అని డిమాండ్ చేశారు. అయితే, ఈ లేఖలో పన్ను పెంపుదలకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రతిపాదనలు సూచించలేదు.