Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా, అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ
- ఒప్పందం కుదిరే అవకాశాలు మృగ్యమేనంటున్న బ్లింకెన్
జెనీవా : రష్యా రూపొందించిన భద్రతా ప్రతిపాదనలను చర్చించేందుకు జెనీవాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు సమావేశమయ్యారు. నాటోతో గల ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు ఒప్పందం కుదురుతుందా లేదా నిర్ణయించనున్నారు. యూరప్ ఖండంలో ఘర్షణల ముప్పును తగ్గించేందుకు అమెరికా, నాటోలను ఉద్దేశించి రష్యా రెండు ముసాయిదా ఒప్పందాలను ప్రతిపాదించించింది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న దౌత్య సమావేశాల్లో ఇది తాజా సమావేశం. రష్యా సరిహద్దుల దిశగా నాటోను విస్తరించబోమని రాతపూర్వకంగా నాటో హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అలాగే నాటోలో భవిష్యత్తులో కూడా ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వరాదని కోరుతోంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత, 1997లో తర్వాత చేరిన పూర్వపు వార్సా ఒప్పంద దేశాల భూభాగంపై ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు చేపట్టకుండా నాటోను నిలువరించాలని రష్యా పట్టుబడుతోంది. అయితే ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువ అని సమావేశానికి ముందుగానే బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశాల వల్ల ఎలాంటి పురోగతి వుంటుందని భావించడం లేదని అన్నారు. అయితే ఈ దౌత్యపరమైన చర్యల ద్వారా రష్యా ఎలాంటి నిర్ధారణలకు వస్తుందో చూసేందుకు ఈ సమావేశం ఒక అవకాశమని పేర్కొన్నారు. కాగా, రష్యా ప్రతిపాదనలను నాటో ప్రధాన కార్యదర్శి స్టోలెన్బెర్గ్ తీవ్రంగా విమర్శించారు. నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ ప్రయత్నాలను వీటో చేయడానికి రష్యాకు ఎలాంటి అధికారం లేదన్నారు. అయితే ఘర్షణలు నివారించాలంటే ఈ చర్యలు తప్పనిసరని రష్యా పట్టుబడుతోంది. సోవియట్ యూనియన్ కూలిపోవడం వల్ల ఏర్పడిన ప్రాంతాల్లో నాటో రాదంటూ 1990ల్లో హామీలు ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శిస్తున్నారు.