Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రివర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్
- రక్షణ మంత్రిగా సాల్వడార్ అలెండీ మనవరాలు
శాంటియాగో : చిలీ దేశ చరిత్రలో మొదటిసారిగా, మెజారిటీ క్యాబినెట్ పదవులు మహిళలకే దక్కాయి. చిలీ అధ్యక్షుడుగా ఎన్నికైన వామపక్షవాది గాబ్రియెల్ బోరిక్ శుక్రవారం తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. మహిళలకే మెజారిటీ పదవులు ఇచ్చారు. మాజీ విద్యార్థి నేతలు పలువురు ఈ పదవులు పొందినవారిలో వున్నారు. కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా
ఎదుర్కొనడం, సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని కలుపుకుని వెళ్లడంతో పాటు ఆర్థిక వృద్ధిని పెంపొందించేలా చర్యలు, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడం ప్రస్తుతం క్యాబినెట్‌కు వున్న ప్రాధాన్యతని బోరిక్ చెప్పారు. నియంత జనరల్ ఆగస్టో పినొచెట్ హయాంలో ప్రస్తుత రాజ్యాంగాన్ని ఆమోదించారు. క్యాబినెట్ మంత్రుల్లో ఏడుగురు 30ఏళ్లలోపు వారే, మొత్తంగా క్యాబినెట్ సగటు వయస్సు 49గా వుంది. కాగా బోరిక్ (35) దేశ పిన్న వయస్కులైన అధ్యక్షులుగా రికార్డు సృష్టించనున్నారు. కొత్తగా నియమితులైన మంత్రుల్లో కమ్యూనిస్టు పార్టీ ఎంపీ కేమిలా వాలెజో వున్నారు. విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్న కేమిలా ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ డాక్టర్ ఇజ్కియా సిచెస్ హోం శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. 1973 మిలటరీ కుట్రలో పదవీచ్యుతుడైన సాల్వడార్ అలెండి మనవరాలు మాయా ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. సెంట్రల్ బ్యాంక్ మాజీ చీఫ్ మారియో మార్సెల్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వైవిధ్యమైన నేపథ్యాలు, శిక్షణ కలిగిన వ్యక్తులకు తన మంత్రివర్గంలో చోటు ఇచ్చినట్టు బోరిక్ తెలిపారు.