Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోపెన్హాగన్ : ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ మహమ్మారిని కొత్త దశకు తీసుకెళ్లిందని.. యూరప్‌లో వైరస్‌ని ముగింపు దశకు చేర్చవచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ ప్రాంతం మహమ్మారి ముగింపు దిశగా కదులుతున్నట్టు సూచిస్తుందని డబ్ల్యూహెచ్ఓ యూరప్ డైరెక్టర్ హాన్స్ క్లజ్ మీడియాకు వెల్లడించారు. మార్చి నాటికి 60 శాతం యూరోపియన్లకు ఒమిక్రాన్ సోకవచ్చని అన్నారు. ప్రస్తుతం యూరప్ అంతటా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వ్యాప్తి కొంత మేర తగ్గిన తర్వాత వ్యాక్సిన్ కారణంగా గాని, వ్యాధి సోకడం వలన గాని శరీరంలో వచ్చిన వ్యాధినిరోధక శక్తి కొన్ని వారాలు, నెలల పాటు ఉంటుందనీ, దీంతో వైరస్ వ్యాప్తి కాలానుగుణతను తగ్గిస్తుందని అన్నారు. కరోనా సాధారణ వ్యాధిగా మారితే.. ముందుగానే జాగ్రత్త పడవచ్చని అన్నారు. ఈ వైరస్ ఒకటి కంటే ఎక్కువ సార్లు వ్యాపించి శాస్త్రవేత్తల్నే ఆశ్చర్య పరిచిందని.. అందువలన వైరస్ పట్ల అప్రమత్తత అత్యవసరమని అన్నారు. ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త అంథోనీ ఫౌసీ కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ వారంలో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు తీవ్రంగా తగ్గుతున్నాయని.. ఇది మంచి విషయమని అన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో కేసుల సంఖ్యలో ఇటీవల పతనం కొనసాగితే.. దేశం మొత్తం ముగింపు దిశగా ఒక మలుపును చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ.. సాధారణంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా స్వల్పంగానే నమోదైందని.. అంటే.. మహమ్మారి సీజనల్ వ్యాధి అయిన సాధారణ ఫ్లూ లా మార్పు చెందుతున్న వాదనకు విశ్వాసం కలిగిస్తుందని అన్నారు.