Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభింపచేసిన వెయ్యి కోట్ల డాలర్లను విడుదల చేయాలని విజ్ఞప్తి
ఓస్లో : ఆఫ్ఘనిస్తాన్‌లో మానవతా పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి బృందం ఆదివారం ఓస్లోలో పశ్చిమ దేశాల అధికారులు, ఆఫ్ఘన్ సివిల్ సొసైటీ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. మూడు రోజుల పాటు ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి నేతృత్వంలోని తాలిబన్ ప్రతినిధులు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల పరిరక్షకులతో భేటీ అయ్యారు. చర్చలు ప్రారంభం కావడానికి ముందుగా, ముత్తాఖి నుండి వచ్చిన వాయిస్ మెసేజ్‌ను తాలిబన్ సాంస్కృతిక, సమాచార శాఖ డిప్యూటీ మంత్రి ట్వీట్ చేశారు. పూర్తి స్థాయి విజయాలతో ఇదొక మంచి పర్యటన కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్‌తో సానుకూల సంబంధాలు ఏర్పడేందుకు నార్వే దేశం ఒక గేట్‌వే కాగలదని చెబుతూ అందుకు కృత్ఞతలు తెలియచేశారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు స్తంభింప చేసిన 1000కోట్ల డాలర్లను వెంటనే విడుదల చేయాలని తాలిబన్లు పట్టుబడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు కొంత మొత్తాన్ని ఐక్యరాజ్య సమితి అందించగలిగింది. విద్యుత్‌తోపాటు ఇతర దిగుమతుల కోసం కొత్త ప్రభుత్వం చెల్లింపులు జరిపేందుకు అనుమతించింది. దాదాపు 10లక్షల మంది చిన్నారులు కరువు ముప్పును ఎదుర్కొంటున్నారని, దాదాపు 3.8కోట్ల దేశ జనాభాలో ఎక్కువమంది దారిద్య్రరేఖకు దిగువున వుండడం పట్ల ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. నార్వేలోని ఆఫ్ఘన్ జర్నలిస్టులు, మహిళా నేతలు, మానవ హక్కుల కార్యకర్తలను కూడా తాలిబన్ ప్రతినిధి బృందం కలుసుకుని చర్చలు జరుపుతుందని నార్వే విదేశాంగ శాఖ తెలిపింది.