Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల తీర్పును కాలరాసే ప్రయత్నాలు
- 27న నూతన అధ్యక్షురాలు కాస్ట్రో ప్రమాణ స్వీకారం
తెగుసిగల్ప : ప్రజాస్వామ్యాన్ని సమర్ధిస్తూ, ప్రజా తీర్పును గౌరవించాలని కోరుతూ వందలాదిమంది ప్రజలు హోండూరస్ నేషనల్ కాంగ్రెస్‌కు వెలుపల ప్రదర్శన చేశారు. ప్రజలిచ్చిన తీర్పుకు విరుద్ధంగా పార్లమెంట్‌ను హైజాక్ చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు జువాన్ ఆర్లాండో హెర్నాండెజ్ నేతృత్వంలోని నియంతృత్వ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హోండూరస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన జియోమారా కాస్ట్రో ఆదివారం విమర్శించారు. పార్లమెంట్ వెలుపల తన మద్దతుదారులను ఉద్దేశించి జియోమారా కాస్ట్రో మాట్లాడుతూ, ప్రస్తుత అధ్యక్షుని నియంతృత్వపు హస్తాల నుంచి అధికారాన్ని తొలగించేందుకు, చట్టవిరుద్ధమైన విధానాలను నిషేధించేందుకే గతేడాది నవంబరులో ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. నవంబరు 28న ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారి తీర్పును, సంకల్పాన్ని గౌరవించాల్సి వుందని అన్నారు. హోండూరస్‌లో నియంతృత్వపు పాలనకు, సాంప్రదాయ రాజకీయాల అవినీతి విధానాలకు స్వస్తి చెప్పే లక్ష్యంతోనే ప్రజలు ఓటు వేశారని ఆమె పేర్కొన్నారు. గత శుక్రవారం నుంచి షెడ్యూల్‌కు అనుగుణంగా ఏదీ జరగలేదన్నారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఓటింగ్‌ను హైజాక్ చేయడానికి అధ్యక్షుడు ప్రయత్నించారని, ప్రమాణ స్వీకారం కూడా చట్టవిరుద్ధంగానే సాగిందన్నారు. ఈ ఆదివారం జరగాల్సిన బోర్డ్్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంపిక కూడా జరగలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 27న జియోమారా కాస్ట్రో అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంది. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆమె డిప్యూటీ లూయిస్ రెడొండో నేతృత్వంలోని పార్లమెంట్ అధ్యక్షవర్గాన్ని ఆహ్వానించారు. లూయిస్ రెండొండో నేతృత్వాన డైరెక్టర్ల బోర్డును ఎన్నుకోవాల్సిందిగా లిబ్రే పార్టీ, సాల్వడార్ పార్టీలతో కూడిన సంకీర్ణం పార్లమెంట్‌కు పిలుపిచ్చింది.