Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కోటి మందికి పైగా చిన్నారులు కోవిడ్ బారినపడ్డారు. అమెరికా పిల్లల వైద్యుల అకాడమీ (ఏఏపీ), బాలల ఆస్పత్రి సమాఖ్య సంయుక్త నివేదికలో ఈ విషయం వెల్లడించింది. జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా పిల్లల్లో మొత్తం 1,06,03,034 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ధ్రువీకరించిన కేసుల్లో పిల్లల కేసుల శాతం 18.4 శాతంగా వుందని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ తలెత్తినప్పటి నుంచి పిల్లల్లో గణనీయంగా కేసులు పెరిగాయి. గత వారంలో 11 లక్షల మందికి పైగా పిల్లలు కోవిడ్ బారిన పడ్డారు. అంటే గత శీతాకాలంలో నమోదైన కేసుల కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. అంతకుముందు వారంలో నమోదైన 9,81,000 కేసుల కన్నా 17 శాతం ఎక్కువ. గత రెండు వారాల్లోనే 20 లక్షల మందికి పైగా పిల్లలు కోవిడ్ బారిన పడ్డారు. అమెరికాలో పిల్లల్లో కోవిడ్ కేసులు లక్షకు పైగా నమోదవడం ఇది వరుసగా 24వ వారం. సెప్టెంబరు మొదటి వారానికి పిల్లలకు సంబంధించి 56 లక్షల కేసులు వుండేవి. ఇప్పడవి కోటి దాటి పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.