Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను మోహరించిన రష్యా
- కీవ్‌కు 8500మంది నాటో, ఇయు బలగాలు
- ఆంక్షలకు సిద్ధమవుతున్న ఇయు
- ఆంక్షల అమలుపై ఈయూలో చీలిక ?
కీవ్/ మాస్కో/ వాషింగ్టన్: ఉక్రెయిన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. రష్యా దాడికి ఉపక్రమించడానికి సిద్ధమవుతోందనే ప్రచారం ఒక వైపు సాగిస్తూ, మరో వైపు పశ్చిమ దేశాలు నిశ్శబ్దంగా తమ సైనిక బలగాలను ఉక్రెయిన్ సమీపానికి తరలిస్తున్నాయి. నాటో, ఇయులకు చెందిన 8500మందిని ఉక్రెయిన్‌లో మోహరించారు. సరిహద్దుల్లో యుద్ధంతో సహా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రష్యా కూడా తగు సన్నాహాలు చేసుకుంటోంది.. సరిహద్దుల్లో అధునాతన నిఘా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాల్లో విభేదాలు గుప్పుమన్నాయి. అమెరికా తోక పట్టుకుని వెళ్లడానికి జర్మనీ సిద్ధంగా లేదు. రష్యా నుంచి చౌకగా గ్యాస్ పొందుతున్న జర్మనీ ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప ఆంక్షలు, ఘర్షణలకు దిగడం సరికాదే భావనతో ఉంది.పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ సెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడంలో ఇతర నాటో సభ్య దేశాలతో చేతులు కలిపేందుకు జర్మనీ నిరాకరించడంపై కొన్ని మిత్రదేశాల్లో అశాంతి నెలకొంది. ఆయుధాల సరఫరా విషయంలో జర్మనీ వైఖరి నిరాశపరిచిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా వ్యాఖ్యానించారు.
కీవ్‌కు ఈయూ, నాటో బలగాలు
రష్యాపై దాడికి అదే పనిగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న అమెరికా ఆ ప్రాంతానికి బలగాలను, ఆయుధాలు చేరవేస్తోంది. నాటో, ఐరోపాకు చెందిన 8,500 మంది సైనికులను ఉక్రెయిన్‌లో మోహరించింది.
నల్ల సముద్రంలోకి రష్యన్ యుద్ధ నౌకలు
బెలారస్‌కు జెట్ విమానాలు
తూర్పు యూరప్‌లో నాటోతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నల్ల సముద్రంలోకి 20 రష్యన్ యుద్ధ నౌకలను, వాటికి మద్దతుగా కొన్ని ఓడలను తరలించాలని పుతిన్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే అమెరికా సామ్రాజ్యవాదులకు టార్గెట్‌గా ఉన్న బెలారస్‌కు రక్షణగా జెట్ విమానాలను తరలించింది. నల్ల సముద్రంలోకి యుద్ధనౌకలతోబాటు క్షిపణి పడవలు, మైన్ స్వీపర్లు, ఉపరితలం నుంచి, సముద్రం మీది నుంచి దాడులు చేయగలిగే సామర్థ్యం ఉన్న నౌకలు ఉన్నాయని, వీటిని రష్యా దక్షిణ తీరంలోని సెవాస్టోపోల్, నొవొరోసిస్క్ ఓడ రేవుల్లో బుధవారం మోహరించినట్లు రష్యా తెలిపింది. సరిహద్దుకు సమీపంలో బెల్గోర్డ్ ప్రాంతానికి కొత్తగా ఎలక్ట్రానిక్ యుద్ధంలో ఆరితేరిన బెటాలియన్‌ను పంపింది. దీనివల్ల సైనిక కదలికలకు సంబంధించిన అవసరమైన సమాచారం అందడానికి పట్టే సమయం తగ్గుతుందని పేర్కొంది. రష్యాలోని ఐదు ఆర్మీ పాలనా విభాగాల్లో ఒకటైన వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఎలక్ట్రానిక్ యుద్ధం కోసం రూపొందించిన పలు విభిన్నమైన వాహనాలు ఈ బెటాలియన్‌లో వుంటాయి. అంటే కమ్యూనికేషన్స్, జిపిఎస్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడానికి రూపొందించిన బోరిసోగ్లెబ్స్క్ 2, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి వీలుండే రీతిలో వున్న కమ్యూనికేషన్ జామింగ్ స్టేషన్ వంటివి ఇందులో వున్నాయి.
క్రీడలను రాజకీయం చేయరాదు
క్రీడలను రాజకీయం చేయడానికి రష్యా, చైనా రెండూ వ్యతిరేకమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యన్ అథ్లెట్లతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ, స్నేహ సంబంధాలను బలోపేతం చేయాలన్నదే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా వుంటుందన్నారు. మరోవైపు అరేబియా సముద్రంలో రష్యా, చైనా నావికా దళాల సంయుక్త సైనిక విన్యాసాలు మంగళవారం ప్రారంభమయ్యాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.