Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టబద్ధతిస్తే ప్రమాదమే : ఐఎంఎఫ్
వాషింగ్టన్ : వర్చ్యూవల్ కరెన్సీలకు చట్టబద్దత కల్పించడం ప్రమాదకరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) మరోమారు హెచ్చరించింది. బిట్ కాయిన్ లాంటి కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ సమగ్రత దెబ్బ తింటుందని తెలిపింది. అదే విధంగా క్రిప్టో వినియోగదారులకు రిస్క్ తప్పదని హెచ్చరించింది. దీంతో బిట్ కాయిన్లకు చట్టబద్దత కల్పించే అంశంలో వేగంగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు ఐఎంఎఫ్ హెచ్చరిక జారీ చేసినట్టయింది. బిట్ కాయిన్‌కు చట్టబద్ధత ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ దేశం గతేడాది బిట్‌కాయిన్‌కు అధికారిక కరెన్సీగా గుర్తింపునిచ్చింది. కాగా ఇది చెల్లదని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీలతో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయనీ, వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఐఎంఎఫ్ బుధవారం హెచ్చరించింది. తమ నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని స్పష్టం చేసింది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 50 శాతం పడిపోయింది. భారత్‌లో క్రిప్టో కరెన్సీలపై పాక్షిక నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఇటీవల స్పష్టం చేసింది. క్రిప్టోను అనుమతించడం ద్వారా తలెత్తే సమస్యలను లేవనెత్తింది. వీటిని విలువ కట్టడం, లావాదేవీలను గుర్తించడం క్లిష్టమని, ట్రేడింగ్‌లో తీవ్రమైన ఒడిదుడుకులు, చట్టబద్దమైన అంశాలు తదితర వాటి వల్ల ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. క్రిప్టో కరెన్సీల వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినే ప్రమాదముందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గతంలోనూ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మోడీ సర్కార్ ఈ కరెన్సీ కట్టడి విషయంలో మెతక వైఖరిని అవలంభించడం ఆందోళనకరం.