Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరల్ రిజర్వు
వాషింగ్టన్ : త్వరలోనే వడ్డీరేట్లు పెంచుతామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే వుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ ప్రకటన వెలువడింది. కరోనా నేపథ్యంలో సరఫరా, డిమాండ్లు మధ్య అసమతుల్యత, ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకోకపోవడం వంటి కారణాల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని రెండు రోజుల సమావేశానంతరం ఫెడరల్ రిజర్వ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ద్రవ్యోల్బణం 2శాతంపైనే వున్నప్పటికీ లేబర్ మార్కెట్ బలంగానే వున్నందున తాము వడ్డీ రేట్లను పెంచాలని భావిస్తున్నామని తెలిపింది. కోవిడ్ తలెత్తినప్పటి నుండి అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన వడ్డీరేట్లను మార్చకుండా రికార్డు స్థాయిలో తక్కువకు కొనసాగించింది. అయితే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వున్నప్పటికీ మార్చిలో జరిగే తదుపరి సమావేశంలో వడ్డీ రేట్లను పెంచవచ్చని ఇటీవల పలువురు ఫెడరల్ రిజర్వ్ అధికారులు చెబుతూ వచ్చారు. డిసెంబరులో వినిమయధరల సూచీ 7శాతం పెరిగిందని అమెరికా కార్మిక విభాగం పేర్కొంది. ఇది గత ఏడాది కాలంలోనే ఎక్కువ. ఆర్థిక వ్యవస్థకు, బలమైన లేబర్ మార్కెట్కు మద్దతుగా నిలుస్తూ, ద్రవ్యోల్బణం మరింత పెరగకుండా నివారించేందుకు కృషి చేస్తామని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. వడ్డీ రేట్లు 0.25శాతం పెరిగే అవకాశముందని భావిస్తున్నట్లు వెల్స్ ఫార్గో సెక్యూరిటీస్కి చెందిన ముఖ్య ఆర్థికవేత్త జే హెచ్.బ్రేసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 1.75శాతంగా వున్న వడ్డీ రేటును మార్చిలో జరిగే సమావేశంలో 2శాతానికి పెంచవచ్చన్నారు.