Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌పై రష్యా డిమాండ్ల తిరస్కృతి
- స్పందనను సమీక్షిస్తున్నాం : పుతిన్
వాషింగ్టన్, మాస్కో : అనుకున్నదే జరిగింది, జెనీవాలో ఇటీవలి వారాల్లో రెండు దఫాలుగా అమెరికా, రష్యా ప్రతినిధి బృందాలు చర్చలు జరిపినా, అమెరికా తన మొండిపట్టును వీడకపోవడంతో ఫలితం లేకపోయింది. ఉక్రెయిన్‌పై ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రష్యా చేస్తున్న డిమాండ్లు వేటినీ ఆమోదించేది లేదని అమెరికా, నాటో స్పష్టం చేశాయి. ఈ మేరకు బుధవారం బైడెన్ ప్రభుత్వం, నాటో విడివిడిగా రష్యాకు రాతపూర్వకంగా తెలియచేశాయి. నాటోను విస్తరించాలన్న తమ విధానంలో ఎలాంటి మార్పులు వుండబోవని స్పష్టం చేశాయి. తూర్పు యూరప్ ప్రాంతంలోకి బలగాలను, సైనిక సామాగ్రిని తరలించడంపై చర్చించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. కాగా, నాటోలో సభ్య దేశంగా ఉక్రెయిన్ను చేర్చుకోరాదన్నదే రష్యా ప్రధాన డిమాండ్‌గా వుంది.
ఇదిలావుండగా, అమెరికా పంపిన రాతపూర్వక డాక్యుమెంట్‌ను రష్యా అధ్యక్షుడు వ్లదీమిర్ పుతిన్ సమీక్షిస్తున్నారని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. రష్యా చేసిన అభ్యర్ధనలను అమెరికా, నాటో పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదని క్రెమ్లిన్ పత్రికా కార్యదర్శి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. తదుపరి చర్చలకు అవకాశాలు వుంటాయని అన్నారు. కేవలం రష్యా ప్రయోజనాలే కాదు, అమెరికా ప్రయోజనాలు కూడా దృష్టిలో వుంచుకునే తాము ఈ ప్రతిపాదనలు చేశామన్నారు. కానీ ముసాయిదా పత్రాలపై వాస్తవికంగా జరిగిన చర్చలకు సంబంధించి చూసినట్లైతే ఇందులో భిన్న స్వభావంగల సమస్యలు వున్నాయన్నారు.
వారాల తరబడి చర్చలు జరిగినా వారి నుంచి సానుకూల ప్రతిస్పందన కొరవడిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ గురువారం వ్యాఖ్యానించారు. తూర్పు వైపునకు నాటోను విస్తరించరాదన్నది తమ ప్రధాన డిమాండ్‌గా వుందనీ, రష్యా సమాఖ్య భూభాగానికి ముప్పు కలిగించేలా తీవ్ర విధ్వంసకర ఆయుధాలను, సామాగ్రిని మోహరించవద్దని కోరామని లావ్రోవ్ తెలిపారు. కానీ యూరో అట్లాంటిక్ ఒప్పంద అమలు గురించే అమెరికా ఎప్పుడూ మాట్లాడుతుందని, విస్తరణకు నాటోకు హక్కుందని, దాన్ని నిషేధించే హక్కు ఏ దేశానికీ లేదని చెబుతూ వస్తున్నారని అన్నారు.
కాగా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాత పాటే పాడారు. రష్యా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా విపత్కర పర్యవసానాలు వుంటాయని, తీవ్ర ఆర్థిక నష్టం వుంటుందని మరోసారి హెచ్చరించారు. అమెరికా వైఖరిలో 'మార్పు లేదు, మార్పు వుండబోదని' బ్లింకెన్ స్పష్టం చేశారు. దాడి జరిగిన పక్షంలో అమెరికా, యూరప్ దేశాల స్పందనపై కూడా చర్చలకు తావు వుండదని అన్నారు.