Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్‌లో ప్రజాస్వా మ్యం, మానవ హక్కుల పరిస్థితి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో 'భారతదేశ బహుళ పక్ష రాజ్యాంగ రక్షణ' అనే అంశంపై హిందూస్ ఫర్ హ్యూమన్‌రైట్స్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, మరో 15 సంఘాలు ఒక సదస్సును నిర్వహించాయి. మసాచుసెట్స్‌కి చెందిన సీనియర్ సెనెటర్ ఎడ్ మార్కే మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ సార్వజనీన మానవ హక్కులకు, చట్టబద్ధ పాలనకు కట్టుబడి వుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ విషయమై ఆందోళనలు తలెత్తుతున్నాయన్నారు. మతపరమైన స్వేచ్ఛను పరిరక్షించడంతో పాటు మైనారిటీల హక్కులను నియంత్రించే చర్యలకు దూరంగా వుండడం కూడా ఆ నిబద్ధతలో భాగమని అన్నారు. కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం భారత్‌లో మతపరమైన మైనారిటీల హక్కులను కాలరాచే ప్రయత్నాలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ కూడా వీడియో సందేశాన్ని పంపారు. ''ఇటీవలి సంవత్సరాల్లో, సుస్థిరమైన పౌర జాతీయవాదం సిద్ధాంతాన్ని వివాదాస్పదం చేసేలా కొత్త ధోరణులు, పద్దతులు ఆవిర్భవిస్తున్నాయి. సాంస్కృతిక జాతీయవాదానికి సంబంధించి కొత్త, ఊహాజనితమైన పద్ధతులను రుద్దుతున్నారు. మతపరమైన మెజారిటీ ముసుగులో ఎన్నికల మెజారిటీ సాధించి, రాజకీయాధికారంపై గుత్తాధిపత్యం సాధించాలని కోరుకుంటున్నారు. ప్రజలను వారి మత విశ్వాసాల ప్రాతిపదికన విభజించాలనుకుంటున్నారు. ఈ పద్ధతులన్నీ తీవ్రమైన అసహనానికి, ఇతర మతాలను అవమానపరచడానికి, అశాంతి, అభద్రతలను పెంపొందించడానికి కారణమవుతాయి. అని హమీద్ అన్సారీ పేర్కొన్నారు. ఈ ధోరణులను చట్టపరంగా, రాజకీయపరంగా వ్యతిరేకించాల్సి వుందన్నారు. మసాచుసెట్స్‌కి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు జిమ్ మెక్‌గవర్న్ మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ గురించి గొంతెత్తాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పౌరసత్వాన్ని, మత గుర్తింపునకు ముడి పెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.