Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాలిబన్లకు స్పష్టం చేసిన అమెరికా, యూరప్ దేశాలు
వాషింగ్టన్ : అంతర్జాతీయ ఆమోదం పొందాలంటే మరిన్ని చర్యలు చేపట్టాల్సి వుందని తాలిబాన్ పాలకులకు అమెరికా, యూరప్ దేశాలు స్పష్టం చేశాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు ఓస్లోలో ఈ నెల 24న అమెరికా, బ్రిటన్, ఇయు, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ, నార్వే దేశాల ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులు సమావేశమయ్యారు. తాలిబన్, ఆఫ్ఘన్ సివిల్ సొసైటీ ప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అనంతరం సంయుక్త ప్రకటన జారీ చేశారు. ఆఫ్ఘన్లో ఏకపక్ష నిర్బంధాలు, కిడ్నాప్‌లు, మీడియా అణచివేతలు, హత్యలు, వేధింపులతో సహా మానవ హక్కుల ఉల్లంఘనలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయని, వీటిని నిలువరించేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి వుందని తాలిబన్లకు సమావేశం స్పష్టం చేసింది. మహిళలు, బాలికల విద్యపై నిషేధం విధించడాన్ని, పురుషుల తోడు లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వేచ్ఛ లేకపోవడం, మహిళా హక్కుల కార్యకర్తలను నిర్బంధించడం గురించి ఆ సంయుక్త ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో అమానుషమైన రీతిలో మానవతా సంక్షోభం నెలకొందని, దానిపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత వుందని సమావేశం అభిప్రాయపడింది. మానవతా సాయం తీసుకెళ్ళే కార్యకర్తలు సులభంగా దేశంలోకి ప్రవేశం లభించేలా చర్యలు తీసుకోవాల్సి వుందని వారు పేర్కొన్నారు. మానవతా సాయం అందించడానికి వున్న అడ్డంకులను తక్షణమే తొలగించాల్సి వుందని పునరుద్ఘాటించారు. ఆఫ్ఘన్ సుస్థిరత, శాంతియుత భవితవ్యానికి హామీ కల్పించేలా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని పోయేలా పటిష్టమైన వ్యవస్థ వుండాలని, మానవ హక్కుల పట్ల గౌరవం పెరగాలని స్పష్టం చేశారు. మార్చిలో దేశవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభమైనపుడు బాలికలందరికీ అన్ని స్థాయిల్లో ప్రవేశం వుంటుందని తాలిబన్ బహిరంగంగానే హామీ ఇవ్వడాన్ని సమావేశం స్వాగతించింది.