Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, ఉక్రెయిన్ నేతలతో చర్చలు శ్రీ ఉక్రెయిన్ ఆటబొమ్మగా మారిందన్న రష్యా
- ఒక దేశ భద్రత కోసం మరో దేశ భద్రతను పణంగా పెట్టరాదన్న చైనా
మాస్కో/ కీవ్/వాషింగ్టన్/ బీజింగ్ : రష్యాకు వ్యతిరేకంగా యుద్ధ ఉద్రిక్తతలను అమెరికా, నాటో రెచ్చగొడుతున్నాయి. అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోలేని అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నెడుతోంది. యుద్ధానికి ముందు అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రష్యా తన సొంత సరిహద్దులకు సైన్యాన్ని పంపితే , దానిని ఉక్రెయిన్‌పై దండెత్తడానికేనంటూ అదే పనిగా ప్రచారం చేస్తున్నది. కార్పొరేట్ మీడియా కూడా దీనిని గుడ్డిగా ప్రచారంలో పెడుతున్నది. ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశమే లేదని రష్య పదే పదే స్పష్టం చేస్తున్నా అమెరికా, నాటోలు యుద్ధ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పనిలో ఉన్నాయి.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై గురువారం అమెరికా, ఉక్రెయిన్, చైనా అధ్యక్షులతో ఫోన్లో చర్చించింది. ఉక్రెయిన్‌కు అన్ని రకాల తోడ్పాటు అందచేస్తామని బైడెన్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా మరోవైపు అమెరికా చేతిలో ఉక్రెయిన్ ఆటబొమ్మగా మారిందంటూ రష్యా వ్యాఖ్యానించింది. తమ స్వప్రయోజనాల కోసం ఒక సాధనంగా ఉక్రెయిన్ను వాడుకుంటున్నారని విమర్శించింది. ఇదిలావుండగా, రష్యా వ్యక్తం చేస్తున్న చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను తక్షణమే పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని చైనా కోరింది. ఒక దేశం భద్రతకు ఇంకో దేశం భద్రతను పణంగా పెట్టరాదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ పేర్కొన్నారు. మిలటరీ బ్లాక్‌లను బలోపేతం చేయడం ద్వారా లేదా విస్తరించడం ద్వారా ప్రాంతీయ భద్రతకు హామీ కల్పించలేమని వాంగ్ అన్నారు.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో గురువారం ఫోనో చర్చలు జరిపారు. 2014లో రూపొందిన నార్మండీ ఫార్మాట్ ద్వారా తూర్పు ఉక్రెయిన్‌లో ఘర్షణలను పరిష్కరించుకునేందుకు అమెరికా తోడ్పాటు వుంటుందన్నారు. బైడెన్‌తో మాట్లాడినపుడు ఉద్రిక్తతల పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలపై చర్చించామని, భవిష్యత్తులో చేపట్టబోయే సంయుక్త కార్యాచరణపై ఒక అంగీకారం కుదిరిందని జెలెన్స్కీ ట్వీట్ చేశారు. అమెరికా సిబ్బంది కుటుంబాలు స్వదేశానికి వచ్చినప్పటికీ కీవ్‌లోని అమెరికా ఎంబసీ మాత్రం తెరిచే వుందని, పూర్తి స్థాయిలో పని చేస్తోందని వైట్‌హౌస్ ప్రకటన పేర్కొంది.
అటబొమ్మగా ఉక్రెయిన్
ఇదిలావుండగా, తమ భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు ఉక్రెయిన్ను అడ్డు పెట్టుకోవడానికి అమెరికా, నాటో ప్రయత్నిస్తున్నాయని రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ విమర్శించారు. దురదృష్టవశాత్తూ, అమెరికా, నాటో చేతుల్లో ఉక్రెయిన్ ఒక ఆటబొమ్మగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఉక్రెయిన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఇటీవల రష్యన్ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెద్వెదెవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాటో స్పందన అభ్యంతరకరం : రష్యా
యురోపియన్ భద్రతా ఒప్పందం కోసం రష్యా చేసిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ నాటో పంపిన సమాధానం అభ్యంతరకరమైన రీతిలో వుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. నాటోకు గల ప్రత్యేక ప్రయోజనాలు, అసాధారణవాదాన్ని ప్రతిబింబించేలా వుందని విమర్శించారు.
రష్యా ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి : చైనా
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై, చైనా-అమెరికా సంబంధాలపై గురువారం చైనా స్టేట్ కౌన్సెలర్, విదేశాంగ మంత్రి వాంగ్ యి, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫోన్లో చర్చించుకున్నారు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల పరిష్కారానికి 2015నాటి మిన్స్క్ ఒప్పందాలను అమలు చేయడం అవసరమని వాంగ్ అభిప్రాయపడ్డారు. అది అన్ని పక్షాలు గుర్తించిన ప్రాథమిక రాజకీయ పత్రమని, దాన్ని వెంటనే అమలుపరచడం అవసరమని అన్నారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు చైనా మద్దతిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని రెచ్చగొట్టడం లేదా అక్కడి పరిస్థితులను అతిగా చేసి చెప్పడం వంటి చర్యలకు దూరంగా వుండాలని, ప్రశాంతత పాటించాలని చైనా అన్ని పక్షాలను కోరింది. ఒక దేశం భద్రతకు ఇంకో దేశం భద్రతను పణంగా పెట్టరాదన్నారు.
మిలటరీ బ్లాక్‌లను బలోపేతం చేయడం ద్వారా లేదా విస్తరించడం ద్వారా ప్రాంతీయ భద్రతకుక హామీ కల్పించలేమని వాంగ్ అన్నారు. ఈ 21వ శతాబ్దంలోనైనా అన్ని పక్షాలు ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వాన్ని విడనాడాలని, చర్చల ద్వారా సమతూకంతో కూడిన, సమర్ధవంతమైన,సుస్థిర యురోపియన్ భద్రతా యంత్రాంగాన్ని రూపొందించాలని కోరారు. రష్యా వ్యక్తం చేస్తున్న చట్టబద్ధమైన భద్రతా ఆందోళనలను తక్షణమే పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని కోరారు.
గతేడాది నవంబరులో వీడియో సమావేశంలో జిన్‌పింగ్, బైడెన్ల మధ్య కుదిరిన కీలకమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడమే ప్రస్తుతం ఇరు దేశాలకు గల ప్రాధాన్యత అని వాంగ్ పేర్కొన్నారు. చైనా పట్ల అమెరికా స్వరంలో మార్పేమీ లేదన్న విషయాన్ని యావత్ ప్రపంచం వీక్షిస్తోందని వాంగ్ వ్యాఖ్యానించారు. చైనాపై అమెరికా ఇప్పటికీ మాటలు తూలుతోందని, దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలకు తాజాగా ఎదురుదెబ్బ తగులుతుందని వాంగ్ పేర్కొన్నారు.