Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహస్య ప్రాంతానికి ప్రధాని కుటుంబం..!
ఒట్టావా (కెనడా) : కెనడాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వేళ .. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆయన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికిగాను ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా... దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశముండటంతో ప్రధాని కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భద్రతా వర్గాలు నిర్ణయించాయి.
కోవిడ్ ఆంక్షలు.. నిరసనల హౌరు..
ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. మాస్కులను ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం సహా ఇతర నిబంధనల్ని కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని ట్రక్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటించింది. దీంతో ట్రక్కు డ్రైవర్ల నుంచి నిరసన వెల్లువెత్తింది. మొదటి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం దీనిపై గళమెత్తింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెనడా వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు భారీ ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానికి వెళ్లే రహదారులన్నీ ట్రక్కు కాన్వారులతో కిక్కిరిసిపోయాయి. 'ఫ్రీడం కాన్వారు' పేరుతో తరలివస్తున్న ఈ ట్రక్కులన్నీ ఒట్టావాలోకి ప్రవేశిస్తే.. హింస మరింత పెరిగే అవకాశముండటంతో ముందు జాగ్రత్తగా భద్రతా వర్గాలు ప్రధాని కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాయి.
ఆందోళనలతో వేడెక్కిన కెనడా.. కలవరంలో భద్రతా వర్గాలు..
కెనడా రాజధాని నగరం ఆందోళనకారులతో వేడెక్కింది. అధికారులు మాట్లాడుతూ ... ట్రక్కు డ్రైవర్లు సహా ఇతర ఆందోళనకారులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు ప్రధాని ట్రూడోను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. ఈ ఆందోళనలు మరింత పెరుగుతుండటం భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. కొందరు నిరసనకారులు 'వార్ మెమోరియల్' పైకి ఎక్కి నృత్యాలు చేయడం తీవ్రదుమారాన్ని రేపింది. ఈ చర్యను అక్కడి సైన్యాధిపతి జనరల్ వేన్ ఐర్, రక్షణ మంత్రి అనితా ఆనంద్ తీవ్రంగా ఖండించారు. దేశం కోసం అమరులైన త్యాగాలను కించపరుస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.