Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా సీనియర్ అధికారి వ్యాఖ్య
వాషింగ్టన్ : ఉక్రెయిన్ విషయంలో రష్యాపై ఆంక్షలు విధించాల్సి వస్తే ఆ ఆంక్షలను చాలా రహస్యంగా వుంచుతామని అమెరికన్ సీనియర్ అధికారి ఆదివారం వ్యాఖ్యానించారు. వాటిని ముందుగానే రష్యా తెలుసుకునే అవకాశం లేదని అన్నారు. అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలాండ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాపై విధించాల్సిన ఆంక్షలపై అమెరికా కసరత్తు చేస్తోందని చెప్పారు. ఆ ఆంక్షలు ఏ రీతిలో వుండబోతున్నాయో రష్యా ముందుగానే తెలుసుకునే వీలు కూడా లేదని అన్నారు. ''ఈ ఆంక్షల ప్యాకేజీకి సంబంధించి...మేమేం చేయబోతున్నామనే విషయంలో కొంతమేరకు వ్యూహాత్మక సందిగ్థత నెలకొన్నపుడు ముందుగా మాట్లాడకుండా వుండడం మంచింది.'' అని వ్యాఖ్యానించారు. ''అవి, ఆర్థికపరమైన చర్యలా, ఎగుమతుల నియంత్రణలా, రష్యా ప్రముఖులపై కొత్త ఆంక్షలా ఏవైనా కావచ్చు, వీటిని ఇప్పుడే వెల్లడించినట్లైతే రష్యా వాటి ప్రభావాన్ని తగ్గించడానికి చూడొచ్చు, అప్పుడు మాకు ఎలాంటి లాభం వుండదు.' అని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన పక్షంలో తక్షణమే అమల్లోకి వచ్చేలా కొన్ని ఆంక్షలను రూపొందించడంపై సెనెటర్ బాబ్ మెనెండెజ్ నేతృత్వంలోని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల బృందం ఒక అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్న నేపథ్యంలో నూలాండ్ ప్రకటన వెలువడింది. అయితే రష్యా బ్యాంకులపై, ఎగుమతులపై, నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించిన దిగుమతులపై ఆంక్షలు వుండవచ్చని సూచనప్రాయంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇయుతో కలిసి కూడా అమెరికా ఈ విషయమై కసరత్తు చేస్తోంది.