Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇయును హెచ్చరించిన నాటో
- ఇతరత్రా మార్గాలు అన్వేషించాలని సలహా
బ్రసెల్స్ : పశ్చిమ యూరప్ దేశాలు గ్యాస్ సరఫరా కోసం రష్యాపై ఆధారపడడం తగ్గించుకోవాలని నాటో హెచ్చరించింది. ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అది సలహా ఇచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దును కాపాడే పేరుతో రష్యాపై దాడికి అమెరికా రంకెలు వేస్తున్న తరుణంలో నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్ స్టాల్టెన్బెర్గ్ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యాను బెదిరించేందుకు అమెరికా నాటో బలగాలను పెద్దయెత్తున ఉక్రెయిన్లో మోహరించిన సంగతి తెలిసిందే. అయితే, రష్యాతో ఘర్షణకు నాటోలో సభ్య దేశాలైన యూరప్ దేశాలు ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ సిద్ధంగా లేవు. కారణం రష్యా నుంచి ఈ దేశాలు చౌకగా గ్యాస్ పొందుతున్నాయి. ఉక్రెయిన్పై గనుక అమెరికా యుద్ధానికి దిగితే యూరప్ ఖండంలోనే కాదు, ప్రపంచ వ్యాపితంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యాతో యుద్ధం కానీ, ఆ దేశంపై ఆంక్షలు కానీ విధిస్తే యూరప్ ఖండంలో గ్యాస్, చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయని, కాబట్టి ఇతరత్రా మార్గాలను కూడా పరిశీలించాలని స్టాలెన్బర్గ్ కోరారు. ఇయు గ్యాస్ దిగుమతుల్లో 41శాతం రష్యా నుండే వస్తాయి. ముడిచమురు దిగుమతులు కూడా 26.9శాతంగా వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల ఇతర వనరుల నుండి సకాలంలో, తగినంత మొత్తంలో యూరపు దేశాలకు ఖనిజ వాయువు సరఫరాలు అందేలా అమెరికా, ఇయు కసరత్తు చేస్తున్నాయని ఇయు కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెన్ లేయన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.