Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఏఈ మరో కీలక నిర్ణయం..
అబుధాబి: ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానానికి వీలుగా ఈ ఏడాది నుంచి తన వారాంతాలను మార్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).. తాజాగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 జూన్ నుంచి కార్పొరేట్ పన్ను విధించనున్నట్టు ఆర్థిక శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రూ.76.18 లక్షల (3.75 లక్షల యూఏఈ దిర్హామ్) కంటే ఎక్కువ వ్యాపార లాభాలపై తొమ్మిది శాతం పన్ను కట్టాల్సి ఉంటుదని తెలిపింది. పన్నుల విషయంలో బహుళజాతి సంస్థలకు ఈ దేశం దీర్ఘకాలంగా స్వర్గధామంగా ఉంది. అనేక ఎంఎన్సీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి.'కార్పొరేట్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా.. పారదర్శకత, హానికర పన్ను విధానాల కట్టడి విషయంలో యూఏఈ తన నిబద్ధతను మరోసారి చాటుకుంటుంది' అని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి యూనిస్ హాజీ అల్ ఖూరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ట్యాక్సుల్లో తొమ్మిది శాతమే అత్యంత తక్కువని పేర్కొన్నారు. యూఏఈ ఫ్రీ- ట్రేడ్ జోన్లలో పన్ను రాయితీలు అలాగే ఉంటాయని చెప్పారు. రియల్ ఎస్టేట్, ఇతర పెట్టుబడులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను లేదా మూలధన లాభాల పన్నును ప్రవేశపెట్టే ప్రణాళిక లేదన్నారు. ముడి చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో యూఏఈ కొన్నాళ్లుగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే.