Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 230సీట్లకు గానూ 117స్థానాలు కైవసం
- కనీస వేతనాన్ని పెంచుతామన్న ప్రధాని కోస్టా
లిస్బన్ : పోర్చుగల్ పార్లమెంట్ ఎన్నికల్లో సోషలిస్టులు విజయం సాధించారు. 230 సీట్లు ఉన్న పార్లమెంట్లో ప్రధాని ఆంటానియో కోస్టా నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ 117 స్థానాలు సాధించింది. గత పార్లమెంటులో ఈ పార్టీకి 108 స్థానాలు ఉండేవి. చిన్న పార్టీల మద్దతుపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిన కోస్టా ప్రవేశపెట్టిన బడ్జెట్ వీగిపోవడంతో పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లారు. మధ్యేవాద వామపక్షవాది అయిన ఈ మాజీ కమ్యూనిస్టు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం తథ్యమని చాలా ఒపీనియన్ పోల్స్ పేర్కొన్నాయి. దీనికి భిన్నంగా ఆయన సంపూర్ణ మెజారిటీ సాధించారు. సోషలిస్టు పార్టీ చరిత్రలో సొంతమెజార్టీతో అధికారంలోకి రావడం ఇది రెండవసారి. ''సంపూర్ణ మెజారిటీ సాధించడమంటే సంపూర్ణ అధికారం రావడమని అర్థం కాదు. ఒక్కరే పాలించాలని కూడా అర్థం కాదు. బాధ్యతలు మరింత పెరిగాయని అర్థం. పోర్చుగల్ ప్రజల కోసం, దేశం కోసం పాలించాలి, వారి కోసమే పనిచేయాలి.'' అని కోస్టా సోమవారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన విజయోత్సవ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. సోషలిస్టు పార్టీ మద్దతును కోల్పోయిందని ఎన్నికల ముందు స్పష్టమవగా ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన రీతిలో సంపూర్ణ విజయాన్ని సాధించడం విశేషమే.. కోవిడ్ మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యల నుండి దేశాన్ని బయటపడవేసేందుకు ఇయు అందించిన 1807కోట్ల డాలర్ల ప్యాకేజీని ఆమోదించి, అమలు చేసేందుకు కోస్టా పార్టీకి ఈ విజయం మార్గాన్ని సుగమం చేసింది. కనీస వేతనాన్ని నెలకు 900యూరోలు (1005డాలర్లు)కు పెంచడం, వారానికి నాలుగు రోజుల పనిదినాలకు మారడంపై చర్చలు ప్రారంభించడం వంటి విధానాలను అమలు చేసేందుకు సిద్ధంగా వున్నానని కోస్టా ప్రకటించారు. ఈ మధ్యంతర ఎన్నికల్లో మితవాద చెగా పార్టీకి కూడా సీట్లు పెరిగాయి. 12సీట్లు సాధించి మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టీగా నమోదవనుంది. చెగా పార్టీ రాజకీయాభిప్రాయాలతో విభేదాలు వున్నందున వారు మినహా మిగిలిన అన్ని పార్టీలతో చర్చలకు కూడా సిద్ధంగానే వున్నామని కోస్టా ప్రకటించారు.