Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరవుతున్న పుతిన్
మాస్కో : వాణిజ్యం, అంతర్జాతీయ సంబంధాల్లో చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి కొత్త శకాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆవిష్కరించారు. బీజింగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ కోసం పుతిన్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వ వార్తా సంస్థ సిన్హువా గురువారం పుతిన్ వ్యాసాన్ని ప్రచురించింది. సమగ్ర భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారంలో రష్యా-చైనా సంబంధాలు 'సమర్ధవంతమైన, బాధ్యతాయుతమైన, భవిష్యత్ కోసం ఆకాంక్షకు ఒక నమూనాగా మారాయని' పుతిన్ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి స్నేహ సంబంధాలతో, విశ్వాసంతో ఇరు దేశాలు సన్నిహితంగా కలిసిమెలిసి వున్నాయని వ్యాఖ్యానించారు. ''సమానత్వం, ఒకరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం, రాజకీయ, సైద్ధాంతిక పరిస్థితులు, ఒత్తిళ్ళ నుండి, గతం యొక్క అవశేషాల విముక్తి వంటి అంశాల ఆధారంగా మాస్కో, బీజింగ్‌ల మధ్య సంబంధాలు వున్నాయని ఆ వ్యాసం పేర్కొంది. 2001లో కుదిరిన మంచి పొరుగు, స్నేహపూర్వక సహకార ఒప్పందాన్ని ఈ సందర్బంగా ఆయన ఉదహరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి ఒకే రకమైన దృక్పథం, ధోరణులతో ఇరు దేశాలు తమ విదేశాంగ విధానాలను సమన్వయం చేసుకుంటాయని పుతిన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఐక్యరాజ్య సమితికి గల కేంద్ర సమన్వయ పాత్రను బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్య సమితి నిబంధనావళి కీలకంగా వుండే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ప్రమాణాలు క్షీణించకుండా అడ్డుకునేందుకు ఇరు దేశాలు కలిసి కృషి చేస్తున్నాయని పుతిన్ చెప్పారు. ఈనాడు అంతర్జాతీయ పరిస్థితులు సవాలుగా మారాయని, ఇటువంటి తరుణంలో రెండు దేశాలు స్థిరమైన, కీలకమైన పాత్రను పోషించాల్సి వుందని అన్నారు. దేశాల మధ్య సంబంధాలను మరింత ప్రజాస్వామ్యయుతంగా తీర్చిదిద్దడంలో, మరింత సమానత్వంతో వుండేలా, అందరినీ కలుపుకుని పోయేలా చేయడంలో ఇరు దేశాలదీ కీలక పాత్రేనని పుతిన్ పేర్కొన్నారు. ఆర్థిక సహకారానికి కూడా ఇది వర్తిస్తుందన్నారు. 2021లో కరోనా ఆంక్షలు వున్నప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం చారిత్రిక రీతిలో1400కోట్ల డాలర్లకు చేరిందన్నారు. తమ ఉత్పత్తులైన స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్లను ప్రయోగించినందుకు, రష్యా అభివృద్ధిపరిచిన కోవిడ్ వ్యాక్సిన్లను వాడుతున్నందుకు చైనాకు పుతిన్ కృతజ్ఞతలు తెలియచేశారు.