Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో కోలుకోని లేబర్ మార్కెట్
వాషింగ్టన్ : అమెరికాలో ప్రయివేటు కంపెనీలు జనవరిలో ఏకంగా 3,01,000 ఉద్యోగాల్లో కోత విధించాయి. ఒమిక్రాన్ వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా లేబర్ మార్కెట్ పూర్తి స్థాయిలో కోలుకోలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోందని పే రోల్ డేటా కంపెనీ ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్ (ఏడీపీ) బుధవారం పేర్కొంది. ఒమిక్రాన్ ప్రభావాల కారణంగా కొత్త ఏడాది ప్రారంభంలోనే లేబర్ మార్కెట్ కోలుకోవడం క్షీణించింది. ఇది తాత్కాలికమే అయినా ఉపాధి అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఏడీపీ ముఖ్య ఆర్థికవేత్త నెలా రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. 2020 డిసెంబరు నుండి ఇటీవల వరకు చూసినట్లైతే, మెజారిటీ పారిశ్రామిక రంగాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతూ వస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది నాల్గో త్రైమాసికంలో కొంత మేరకు కోలుకున్నప్పటికీ విశ్రాంత మరియు ఆతిధ్య రంగాలు బాగా దెబ్బతిన్నాయని, ఏకంగా లక్షా 54వేల ఉద్యోగాలు పోయాయని రిచర్డ్సన్ పేర్కొన్నారు. జనవరిలో సేవా రంగంలో 2,74,000 ఉద్యోగాలు పోయాయని, వస్తూత్పత్తి రంగం 27వేల ఉద్యోగాలను కోల్పోయిందని ఏడీపీ తన నివేదికలో పేర్కొంంది. మూడీస్ అనలిటిక్స్‌తో కలిసి ఎడిపి పరిశోధనా సంస్థ ఈ విశ్లేషణ జరిపింది. పెద్ద పెద్ద సంస్థలు 98వేల మంది కార్మికులను తగ్గించాయి, ఒక మోస్తరు సంస్థలు 59వేల మందిని తీసేయగా, చిన్న కంపెనీలు 1,44,000మంది ఉద్యోగులను తగ్గించాయని ఆ నివేదిక తెలిపింది. అంటే వివిధ స్థాయి కంపెనీల్లో ఈ రికవరీ స్థాయి కూడా సమతూకంకగా లేదని వెల్లడవుతోందని పేర్కొంది. అమెరికా కార్మిక శాఖకి చెందిన కార్మిక గణాంకాల బ్యూరో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉపాధి డేటాకి సంబంధించి కీలకమైన నెలవారీ నివేదిక విడుదల చేయడానికి రెండు రోజులు ముందుగా ఈ నివేదిక వచ్చింది.