Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఆంక్షలు ఎత్తివేతపై ఇరాన్
టెహ్రాన్: తమ పౌర అణు కార్యక్రమంపై ఆంక్షలు ఎత్తివేస్తూ అమెరికా నిర్ణయించడం మంచిదే, కానీ అది మాత్రమే చాలదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇరాన్‌తో 2015 లో కుదిరిన అణు ఒపందాన్ని పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఆంక్షలు సడలించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. విశ్వాసాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఆంక్షలను తొలగిస్తున్నట్లు అమెరికా చెప్పిన మాటలు కాగితాలపై బాగానే ఉంటాయి. దేనికైనా ఆచరణే గీటురాయి అని ఇరానియన్ విదేశాంగ మంత్రి హుస్సేని అమీర్ అబ్దుల్లా పేర్కొన్నట్లు ఇర్నా వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ శంఖానీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఘడియకో తీరుగా వ్యవహరిస్తుందని అన్నారు. అణు కార్యక్రమంపై ఏ ఒప్పందమైనా అది తమ దేశానికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలన్నదే ఇరాన్ విధించే ఏకైక షరతు అని ఆయన ట్వీట్ చేశారు. 2015 నాటి జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (జెసిపిఒఎ)లో తిరిగి చేరేందుకు వీలుగా ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలను ఎత్తివేస్తున్నామని, దీంతో ఒక సాంకేతికమైన అడ్డంకి తొలగిపోయిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. ఆ వెంటనే ఇరాన్ అణు కార్యక్రమంపై ఆంక్షలు తిరిగి విధించాడు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేయడం వల్ల ఇరాన్ పౌర అణు కార్యక్రమంలో ఇతర దేశాలు పాల్గొనేందుకు వీలేర్పడుతుంది. చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతో నేరుగాను, అమెరికాతో పరోక్షంగాను ఇరాన్ చర్చలు, సంప్రదింపులు జరిపేందుకు వియన్నా చర్చలు మార్గం సుగమం చేశాయి.