Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూబా అంతటా నిరసనలు
హవానా: క్యూబాకు వ్యతిరేకంగా అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనానికి ఈ నెల 3వ తేదీతో సరిగ్గా అరవై ఏళ్లు పూర్తయ్యాయి.1962 ఫిబ్రవరి 3న అప్పటి అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ 3,447 నంబర్‌తో ఒక డిక్రీ జారీ చేస్తూ, అమెరికా-క్యూబా మధ్య అన్ని రకాల వాణిజ్యంపై నిషేధం విధించాడు. 1961 విదేశీ సహాయక చట్టంలోని సెక్షన్ 620 (ఎ) కింద ఈ ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఆర్థిక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దిగ్బంధనాన్ని క్యూబాలో విప్లవ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఎన్ని సార్లు ఖండించినా, దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఎన్నిసార్లు తీర్మానాలు చేసినా అమెరికా బేఖాతరు చేస్తూ వస్తున్నది. ఒబామా కాలంలో ఆంక్షల తొలగింపునకు కొంత చొరవ చూపినా, ఆ తరువాత వచ్చిన ట్రంప్ దానికి తూట్లు పొడిచాడు. క్యూబాపై మరిన్ని ఆంక్షలను విధించాడు. అరవై ఏళ్ల ఆర్థిక దిగ్బంధనాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని హవానాతోబాటు దేశంలోని ముఖ్య పట్టణాల్లో ఇటీవల పెద్దయెత్తున ప్రదర్శనలు జరిగాయి. క్యూబాలో విప్లవం విజయవంతమైన నాటి నుంచి అమెరికా ఈ చిన్ని దేశం పట్ల శత్రుపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నది. క్యూబన్ల న్యాయసమ్మతమైన హక్కులను హరించివేస్తున్నది. సామ్రాజ్యవాదుల పెత్తనం నుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు, స్వతంత్రంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకునేందుకు క్యూబా ప్రజలకు గల హక్కును దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. సోషలిస్టు దేశాలతో క్యూబా సంబంధాలు కలిగిఉండడం అంతర్ అమెరికన్ వ్యవస్థ సూత్రాలకు విరుద్ధమంటూ అమెరికా పసలేని వాదనలను ముందుకు తెచ్చింది. అయినా, అమెరికా తీరు మార లేదు.ఈ ఆర్థిక దిగ్బంధనం వల్ల క్యూబా మందులు, ఆహార కొరతతో సహా అనేక ఇబ్బందులనెదుర్కోవాల్సి వచ్చింది. ఇతర దేశాలతో ఆర్థిక, వాణిజ్య లావాదేవీలను అడ్డుకోవడం, విదేశీ పెట్టుబడులు రాకుండా నిరోధించడం వల్ల క్యూబా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. ఈ అమానుషమైన, అన్యాయమైన ఆంక్షలకు స్వస్తి పలకాలని క్యూబా మరోసారి డిమాండ్ చేసింది.