Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేటెంట్ మాఫీ ప్రణాళికపై కీలకదశకు చేరుకున్న చర్చలు
- ప్రణాళిక పరిధిలోకి భారత్ రాకుండా..ఈయూ ప్రతిపాదనలు
జెనీవా : కోవిడ్ వ్యాక్సిన్లు, మందులు, ఔషధాలు, చికిత్సా విధానాలపై ప్రపంచ వాణిజ్య మండలి(డబ్ల్యూటీవో)లో జరుగుతున్న చర్చ కీలకదశకు చేరుకుంది. మేధోపరమైన హక్కుల(పేటెంట్) మాఫీ ప్రణాళికలో భారత్‌కు చోటు ఇవ్వకూడదనే అంశాన్ని పాశ్చాత్యదేశాలు బలంగా వాదిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివిధ దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న సంప్రదింపులు అత్యంత సంక్లిష్టమైన, సున్నితమైన దశలో ఉన్నాయని, భారత్, చైనా ఔషధ తయారీ కంపెనీలకు 'ప్రణాళిక'లో చోటు ఇవ్వకూడదనే సూచనలు వచ్చాయని స్విట్జర్లాండ్‌కు చెందిన న్యూస్ పోర్టల్ ఒక వార్తా కథనం వెలువరించింది. కోవిడ్-19 వ్యాక్సిన్లు, ఔషధాలు, మందులు, చికిత్సా విధానంలో పేటెంట్లకు మినహాయింపు ఇవ్వాలని భారత్, దక్షిణాఫ్రికా ఒక ప్రణాళికను (అక్టోబర్, 2020లో) డబ్ల్యూటీవో ముందు ప్రతిపాదించాయి. టీకాలు, ఔషధాల పంపిణీలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నెలకొన్న అసమానతల్ని తొలగిస్తుందని, సరఫరా పెంచుతుందని పేర్కొన్నాయి. సభ్య దేశాలకు పేటెంట్ మినహాయింపులు ఇవ్వాలన్నది ఇందులోని సారాంశం.
ప్రస్తుతం అమలవుతున్న (ట్రిప్స్ అగ్రిమెంట్)ఒప్పందం ప్రకారం సభ్య దేశాలన్నీ పేటెంట్ హక్కులకు కట్టుబడి ఉండాలి. అయితే దీంట్లో మార్పులు చేయాలని భారత్, దక్షిణాఫ్రికా వాదిస్తున్నాయి. పేటెంట్ మినహాయింపు ప్రణాళిక కనీసం మూడేండ్లపాటు అమలుజేయాలని కోరుతున్నాయి. వీటికి 62దేశాలు మద్దతు పలికాయి. ట్రిప్స్ ఒప్పందం..ప్రపంచంలో అనేక అసమానాతలకు దారితీస్తోందని, టీకా, ఔషధాల పంపిణీ పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పూర్తిగా అందటం లేదని భారత్, దక్షిణాఫ్రికా వాదిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనల్ని యూరోపియన్ యూనియన్, మరికొన్ని దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పేటెంట్ మినహాయింపు ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా డబ్ల్యూటీవోలో తాజాగా మరో ప్రణాళికను ముందుకు తీసుకొచ్చాయి.
భారత్, చైనాలకు వర్తించకూడదు : అమెరికా, ఈయూ
ఎగుమతుల నిబంధనల్ని సడలించాలని ఈయూ వాదిస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా సవరించిన ప్రణాళికతో టీకాల ఉత్పత్తి పెరగదని, అభివృద్ధి చెందిన దేశాల్లో టీకా తయారీదారులతో ఒప్పందం చేసుకోవటం ద్వారానే టీకాల తయారీ పెరుగుతుందని ఈయూ వాదిస్తోంది. తద్వారా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలు తీరుతాయని చెబుతోంది. వీటికి సంబంధించి జనవరిలో డబ్ల్యూటీవోలో చర్చలు జరగ్గా, అమెరికా, చైనా, ఈయూ, భారత్, దక్షిణాఫ్రికా పాల్గొన్నాయి. పేటెంట్ మినహాయింపు ప్రణాళిక భారత్, చైనాలకు వర్తించకూడదనే వాదనను అమెరికా, ఈయూలు బలంగా ముందుకు తీసుకొచ్చాయి. భారత్, చైనా ఔషధ కంపెనీలకు 'ప్రణాళిక' పాక్షికంగా అమలు జేయవచ్చుననే సలహాలు కూడా వచ్చాయి.
కొన్నిదేశాలకే మినహాయింపులు
డబ్ల్యూటీవో నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం, 'పేటెంట్ మినహాయింపు ప్రణాళిక' అమలును కొన్ని దేశాలకే పరిమితం చేయాలన్న వ్యూహంతో పాశ్చాత్య దేశాలు ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి జెనీవాలో జరుగుతున్న సంప్రదింపులు అత్యంత సున్నితమైన, కీలకమైన దశకు వచ్చినట్టు తెలుస్తోంది. పేటెంట్ ప్రణాళిక నుంచి భారత్‌ను పక్కకు తప్పించాలని ఈయూ గట్టిగా భావిస్తోంది. అంతేగాక అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభజన తీసుకురావాలని చూస్తోంది. పాశ్చాత్య దేశాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న భారతీయ కంపెనీలు 'ఈయూ' వాదననే బలపరుస్తున్నాయి.
ఆ మందును రూ.35కే ఇవ్వొచ్చు : దినేశ్ దువా, చైర్మెన్ ఫార్మెక్సిల్
భారత ఔషధ కంపెనీల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా పాశ్చాత దేశాలు వ్యవహరించటం కొత్తేమీ కాదు. నాణ్యత, తక్కువ ధరలో అందించే సామర్థ్యం, సౌలభ్యం భారతీయ కంపెనీలకు ఉంది. ఉదాహరణకు..అమెరికాకు చెందిన 'మోల్న్పిరావిర్'ను కోవిడ్ చికిత్సలో విరివిగా వాడుతున్నారు. సబ్ లైసెన్స్‌తో పెద్ద పెద్ద ఔషధ కంపెనీలు రూ.1800 ధరతో (ఆరు ట్యాబ్లెట్స్) అమ్ముతున్నాయి. పేటెంట్ మినహాయింపులు ఉంటే భారత్‌లోని పలు ఔషధ కంపెనీలు రూ.35 ధర వద్ద అమ్ముతాయి.