Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆక్స్‌ఫామ్ వెల్లడి
సనా : యుద్ధంతో అతలాకుతలమవుతున్న యెమెన్‌లోని వ్యూహాత్మక నగరమైన మారిబ్‌లో ఏడాది కాలంగా సాగిన పోరుతో లక్షమందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారని అంతర్జాతీయ చారిటీ సంస్థ ఆక్స్‌ఫామ్ మంగళవారం పేర్కొంది. ఇప్పటికే నిర్వాసితులైన వారి పరిస్థితులను ఈ పోరు మరింత అధ్వానం చేసిందని పేర్కొంది. యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హుతి రెబెల్స్ గతేడాది ఫిబ్రవరిలో మారిబ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు దాడి చేశారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకుని నగర శివార్లలోకి చేరుకున్నారు. పూర్తిగా యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు సాధించాలన్నది వారి లక్ష్యంగా వుంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో యెమెన్ బలగాలకు సౌదీ సంకీర్ణ బలగాలు తోడవడంతో హుతి రెబెల్స్ ప్రయత్నాలకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ బలగాలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా వున్న ప్రాంతంలో ఈనాడు సామాన్యులు ఆశ్రయం కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆక్స్‌ఫామ్ డైరెక్టర్ ముషిన్ సిద్దికి వ్యాఖ్యానించారు. ఒక్క జనవరిలోనే పౌర నివాసాలపై, పొలాలపై 43సార్లు వైమానిక దాడులు జరిగాయని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. మారిబ్‌లోని పౌరులను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు, శతఘ్ని పేలుళ్లు చోటు చేసుకున్నాయి. జనవరి మాసంలో మందుపాతరలకు ఎనిమిది మంది బలయ్యారు. గతేడాది ఇదే సమయంలో ఐదుగురు చనిపోయారని ఆక్స్‌ఫామ్ పేర్కొంది.