Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగతమే కాదు, సామాజికంగానూ తీవ్ర నష్టమేనంటున్న నిపుణులు
- అమెరికాలో కరోనా ప్రభావంపై అధ్యయనం
వాషింగ్టన్ : కోవిడ్ కారణంగా 2లక్షల మందికి పైగా అమెరికన్ చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ చార్లెస్ నెల్సన్ తెలిపారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులు మరణించడంతో చిన్నారులపై పడిన ప్రభావం గురించి గతేడాది అక్టోబరులో జరిగిన ఒక అధ్యయన ఫలితాలను నెల్సన్ తన వ్యాసంలో పేర్కొన్నారు. తొలుత అధ్యయనం ఫలితాలు ప్రకటించేనాటికి అంటే గతేడాది జూన్ 30కి 1,40,000మంది తల్లిదండ్రులో, సంరక్షకులో మరణించారు. అమెరికా వ్యాప్తంగా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించడంతో ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 50శాతం పెరిగింది. ఏకంగా 2లక్షల మందికి పైగా చిన్నారులు ఇలా తమ సంరక్షకులను కోల్పోవడం వల్ల వ్యక్తిగత నష్టమే కాదు, సామాజికంగా కూడా జరిగే నష్టాన్ని కూడా లెక్కించలేమని ఆ అధ్యయన నివేదికలో డాక్టర్ నెల్సన్ వ్యాఖ్యానించారు. ఈ చిన్నారులు జీవితాంతం ఆ ప్రభావాన్ని ఎదుర్కొనాల్సి వుంటుందన్నారు. తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల పిల్లల్లో మానసిక కుంగుబాటు, విపరీతమైన ఒత్తిడి, ఏమీ చేయలేని ఒక రకమైన నిస్సహాయత వంటి లక్షణాలు వుంటాయని 2018లో ప్రచురితమైన అమెరికన్ సైకియాట్రి జర్నల్ అధ్యయనం పేర్కొంది. తల్లిదండ్రులను కోల్పోవడమనేది ఒక పిల్లవాడు అనుభవించే అత్యంత బాధాకరమైన సంఘటన అని రచయిత వ్యాఖ్యానించారు. ఈ నష్టాలు వారినే కాదు, సమాజాన్ని కూడా తీవ్రంగా అతలాకుతలం చేస్తాయి, అస్థిరపరుస్తాయి. పిల్లలలను భయంకరమైన అనుభవాలకు గురి చేస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వీరిని ముఖ్యంగా కాస్త పెద్దగా వున్న పిల్లలను సంరక్షణా గృహాల్లో వుంచరాదని డాక్టర్ నెల్సన్ వ్యాఖ్యానించారు. వీరు స్కూళ్ళలో కూడా బాగా వెనుకబడి వుంటారని, మిగిలిన వారిని అందుకోవడానికి పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. అలాగే పిల్లల వ్యవహార శైలిలో కూడా తీవ్రమైన మార్పులు రావడానికి దారి తీస్తుంది. పైగా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని హెచ్చరించారు. వీరు తరచుగా మానసిక, శారీరక దూషణలకు గురవాల్సి వస్తుందన్నారు. గతంలోని మిగిలిన వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ వేరియంట్ పిల్లలను బాగా ప్రభావితం చేసింది.