Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర మిలియన్ మరణాలు : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన తర్వాతే ప్రపంచ వ్యాప్తంగా అర మిలియన్ (5లక్షల) మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆవేదన వ్యక్తం చేసింది. ఇవి విషాదాన్ని మించిన గణాంకాలని పేర్కొంది. గత నవంబర్‌లో ఒమిక్రాన్ వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రపపంచ వ్యాప్తంగా 130 మిలియన్ కేసులు (13 కోట్లు) 5 లక్షల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ ఇన్సిడెంట్ మేనేజర్ అబ్దీ మహ్మద్ అన్నారు. గత ఏడాది ప్రపంచాన్ని వణికించిన డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ అధిగమించిందనీ, తీవ్రమైన అనారోగ్యానికి దారి తీసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యంత వేగంగా వ్యాప్తి చేసే గుణమే అందుకు కారణమని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరుగుతున్న సమయంలో కూడా 5 లక్షల మంది ప్రజలు చనిపోయారని, ఏదో జరుగుతుందని ఓ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒమిక్రాన్ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని ప్రతి ఒక్కరూ భావించినప్పటికీ.. వెలుగుచూసిన నాటి నుండి అర మిలియన్ మంది చనిపోవడం ఆందోళన కల్గించే అంశమని చెప్పారు.