Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డ్యూమాకి రష్యా కమ్యూనిస్టుల వినతి
- హింసను ఆపడానికి ఇదొక్కటే మార్గమని వ్యాఖ్య
మాస్కో : ఉక్రెయిన్ నుండి చీలిపోయిన డాంటెస్క్, లుగాన్క్స్ రిపబ్లిక్లను గుర్తించాలంటూ రష్యన్ కమ్యూనిస్టులు డ్యూమాకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి పంపిన ముసాయిదా సందేశంపై ఈ నెల 15న పార్లమెంటరీ కమిటీలో విచారణ జరగనుందని రష్యన్ ఫెడరేషన్ కమ్యూనిస్టు ఎంపి, డాక్యుమెంట్ రూపకర్తల్లో ఒకరైన లియోనిద్ కలైషింకోవ్ తెలిపారు. ఒకవైపు పశ్చిమ దేశాలు దూకుడుగా ఉక్రెయిన్‌పై యుద్దోన్మాదాన్ని రెచ్చగొడుతుంటే మరోవైపు దిగువ సభలోని కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీవర్గం, పార్టీ నేత గెన్నదీ జుగనోవ్ ఈ విజ్ఞప్తి చేశారు. ఆ రెండు రిపబ్లిక్లను స్వతంత్ర, సార్వభౌమాధికార రిపబ్లిక్‌లుగా పరిగణించి, గుర్తించాలన్న అభ్యర్ధనతో పుతిన్‌కు సందేశం పంపాలని కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ప్రభుత్వాన్ని 2014లో గద్దె దించిన తర్వాత ఉక్రెయిన్ నుండి ఈ రెండు రిపబ్లిక్లు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. రష్యా ఈ రెండు రిపబ్లిక్ల్లో దేన్నీ ఇంతవరకు గుర్తించలేదు. మిన్క్క్ ఒప్పందానికే కట్టుబడి వుంది. కానీ ఆ ఒప్పందం అమలు కావడం లేదు. ఉక్రెయిన్‌లోని తూర్పు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించడం ఇప్పుడు అవసరమని జుగనోవ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిరంతరాయంగా సాగుతున్న హింస, హత్యలను ఆపాలంటే ఇదొక్కటే మార్గమని అన్నారు. 57మంది ఎంపీలతో దేశంలోనే రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన రష్యన్ కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్లో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా వుంది. పార్లమెంట్‌లోని అన్ని వర్గాల నేతలు కూడా ఈ గుర్తింపునకు మద్దతివ్వడానికి సిద్ధంగా వున్నారని అన్నారు.