Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేధింపులకు గురవుతున్న ముస్లింలు
- వెబ్ సదస్సులో ప్రముఖులు, మేధావుల విమర్శ
వాషింగ్టన్ : భారత్‌లో ఇస్లామో ఫోబియా చాలా దారుణమైన రూపాన్ని తీసుకుంటోందని ప్రముఖ రచయిత, మేధావి, హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ నోమ్ చోమ్స్కీ వ్యాఖ్యానించారు. దేశంలోని దాదాపు 25కోట్ల మంది ముస్లింలు వేధింపులకు గురవుతున్న మైనారిటీలుగా మారారని పేర్కొన్నారు. పశ్చిమ ప్రాంతమంతా ఇస్లామోఫోబియా పెరుగుతున్నది. భారత్‌లో అయితే మరీ దారుణంగా వుందని అన్నారు. ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన వీడియో సందేశం పంపారు. 'భారత్‌లో దిగజారుతున్న విద్వేష ప్రసంగాలు, హింస' అనే అంశంపై జరిగిన సదస్సులో చోమ్స్కీతో పాటు పలువురు మేధావులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ హయాంలో కాశ్మీర్లో నేరాలు పెచ్చరిల్లుతున్నాయని చోమ్స్కీ వ్యాఖ్యానించారు. కాశ్మీర్లో నేరాలకు చాలా దీర్ఘ చరిత్ర వుందన్నారు. ఇక్కడ నెలకొన్న సైనిక నియంత్రణ చూస్తుంటే ఒకోసారి ఆక్రమిత పాలస్తీనా గుర్తుకు వస్తోందంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియాలో మొత్తంగా పరిస్థితి బాధాకరంగా వుందన్నారు. ముఖ్యంగా ఏం జరగకూడదో అది జరుగుతోందని అన్నారు. భారత రచయిత, వెస్ట్‌మినిస్టర్ యూనివర్శిటీ లెక్చరర్ అన్నపూర్ణ మీనన్ మాట్లాడుతూ, భారత్‌లో పత్రికా స్వేచ్ఛపై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలన్నారు. బీజేపీ హయాంలో పరిస్థితి మరీ ఆందోళనకరంగా వుందన్నారు. కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వహించినందుకే కొత్త ఏడాదిలో ఇప్పటికే నలుగురు జర్నలిస్టులు చనిపోయారని, వాస్తవిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుందన్నారు. ప్రముఖ కాశ్మీరీ జర్నలిస్టు, కాశ్మీర్ వాలా వ్యవస్థాపకులు, సంపాదకులు ఫహద్ షాను దేశద్రోహం, తీవ్రవాదం చట్టాల కింద అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ ఆసియా అడ్వకసీ డైరెక్టర్ జాన్ సిఫన్ మాట్లాడుతూ, మైనారిటీలను పణంగా పెట్టి భారత ప్రభుత్వం మెజారిటీ మతాన్ని పెంచి పోషించడమే భారత రాజ్యాంగానికి అసలైన ముప్పని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో హిందూ ఓట్లను రాబట్టుకునేందుకు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ముస్లిములకు వ్యతిరేకంగా విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శించారు. మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని పౌరసత్వ చట్టం తీసుకొచ్చారని అన్నారు. భారత ఆంత్రోపాలజిస్ట్, బర్కిలీ యూనివర్శిటీ స్కాలర్ అయిన అంగనా చటర్జీ మాట్లాడుతూ ముస్లిం జాతి ప్రక్షాళనలో హిందూ మత పెద్దల హస్తం వుందని విమర్శించారు. దేశ భద్రతకు, హిందూ జీవన విధానానికి ముస్లింలే అతిపెద్ద ముప్పనేలా బిజెపి నేతలు, అనుబంధ గ్రూపులు చిత్రీకరించాయని వ్యాఖ్యానించారు.
మా విషయాల్లో మీ జోక్యం అనవసరం !
హిజాబ్ వివాదంలో విదేశీ స్పందనలపై కేంద్రం ఆగ్రహం
కర్నాటక రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న హిజాబ్ వివాదంపై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ ప్రముఖులతో పాటు కొన్ని దేశాలు కూడా దీనిపై స్పందిస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా అమెరికా సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ఇవన్నీ తమ అంతర్గత విషయాలని, వీటిపై ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పింది. కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ వివాదం ప్రస్తుతం కర్నాటక కోర్టు పరిశీలనలో వుందని, సమస్యలేమైనా తలెత్తితే రాజ్యాంగ పరిధిలో, ప్రజాస్వామ్య నైతిక విలువలు, సిద్ధాంతాల చట్రపరిధిలో పరిష్కరిం చుకోగలమని బగ్చి పేర్కొన్నారు. భారత్‌లో మైనారిటీల పట్ల ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపడుతూ అంతకుముందు పాక్ ప్రభుత్వం కూడా ఇదే తీరున వ్యాఖ్యానించింది. ముస్లింల ప్రాధమిక హక్కును నిరాకరించడం పూర్తిగా అణచివేత చర్య అని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి విమర్శించారు. అమెరికా పౌర హక్కుల కార్యకర్త, ప్రొఫెసర్ నోమ్ చోమ్స్కీ కూడా భారత్‌లో ఇస్లామోఫోబియా పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.