Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండ్రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తుతుందంటూ ప్రచారం
- ఉక్రెయిన్‌పై దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపు
- డాన్‌బాస్‌పై దాడికి ఉక్రెయిన్ సేనలను ఉసిగొల్పుతున్న అగ్రరాజ్యం
- రష్యన్ జలాల్లో పట్టుబడిన అమెరికన్ జలాంతర్గామి
వాషింగ్టన్/మాస్కో : ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనను దౌత్య మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు ఒక వైపు రష్యా ఫ్రాన్స్ యత్నిస్తుండగా, మరో వైపు అమెరికా యుద్ధ నాదాలతో (వార్ హిస్టీరియా) ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఉక్రెయిన్‌పై రెండ్రోజుల్లో రష్యా దండెత్తుతుందంటూ తన ప్రచార బాకాల ద్వారా ఊహాగానాలను ప్రచారంలో పెట్టింది. దానికి ఆధారాలు చూపమంటే ఇంటెలిజెన్స్ నివేదికలు అని చెబుతోంది. ఎవరా ఇంటెలిజెన్స్ అంటే బహిరంగంగా మాట్లాడే అధికారం లేని, తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారంటూ దాటేస్తున్నది. ఇంకో వైపు ఉక్రెయిన్‌పై గనుక రష్యా దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ బైడెన్ రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై దండెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు వచ్చిన వార్తలను పుతిన్ తోసిపుచ్చారు. ఉక్రెయిన్ను నాటో సైనిక కూటమిలో చేర్చుకోమని హామీ ఇవ్వాలని, తూర్పు యూరప్ నుంచి నాటో బలగాలను ఉపసంహరించుకోవాలని రష్యా చేసిన డిమాండ్లపై స్పందించకుండా అమెరికా బెదిరింపులకు దిగుతోందని, ఉక్రెయిన్ చీలిక రిపబ్లిక్‌లైన డాన్బాస్, క్రిమియాపైకి ఉక్రెయిన్ సేనలను ఎగదోస్తూ, వాటికి భారీగా ఆయుధాలు అందిస్తోందని, నాటో బలగాలను ఉక్రెయిన్‌కు మద్దతుగా పంపుతున్నదని రష్యా పేర్కొంది. ఇటువంటి బెదిరింపులకు తాము భయపడమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు అమెరికాకు స్పష్టంగా తేల్చి చెప్పారు. పసిఫిక్ లోని కురిల్ దీవుల సమీపంలో రష్యన్ జలాల్లో ఒక అమెరికన్ జలాంతర్గామిని రష్యన్ నావికాదళం శనివారం గుర్తించి, దానిని వెనక్కి తిప్పి పంపింది. ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా మిత్రులను కూడగట్టే యత్నాలను ప్రారంభించింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఇండో-పసిఫిక్ క్వాడ్ కూటమిలో శుక్రవారం ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించి, క్వాడ్ భాగస్వాముల సహకారాన్ని అర్థించడం దీనిలో భాగమే. ఇండో-పసిఫిక్ దేశాలతో ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి చైనాను లక్ష్యంగా చేసుకున్నది. ఈ కూటమిలో భాగస్వామిగా వున్న భారత్ రష్యాతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంది. అమెరికా కోసం రష్యాను దూరం చేసుకునే స్థితి లేదు. క్వాడ్ భాగస్వామ్య దేశాలు మౌఖికంగా మద్దతు ఇవ్వవచ్చునేమో కానీ, యుద్ధంలో సహకారం అందించగలిగే స్థితి అయితే ప్రస్తుతానికి కానరావడం లేదు. ఇండో పసిఫిక్ దేశాలకు చైనాను, ఐరోపా దేశాలకు రష్యాను బూచిగా చూపి మిత్రులను సమీకరించేందుకు అమెరికా వేస్తున్న ఎత్తులు ఫలించే సూచనలు లేవు. అమెరికా చెప్పినట్టల్లా ఆడడానికి యూరప్‌లో జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాలు సిద్ధంగా లేవు. రష్యాతో తగాదా పెట్టుకుంటే, ఆ దేశం నుంచి చౌకగా లభించే గ్యాస్‌ను కోల్పోవాల్సి వస్తుందనేది వాటి భయం. మాక్రాన్ పుతిన్‌తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నించడంలో ఆంతర్యమిదే. ఫిబ్రవరి 10 నార్మాండి ఫార్మాట్ నాయకుల రాజకీయ సలహాదారులు సమావేశమై ఈ సంక్షోభాన్ని నార్మాండి కూటమి భాగస్వామ్య దేశాలు చర్చించి శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చాయి.. మరో వైపు అమెరికా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు, అవసరమైతే దాడికి కూడా సిద్ధంగా ఉండాలని నాటోలోని తన మిత్ర దేశాలపై ఒత్తిడి తెస్తోంది. అంతకంతకూ బలహీనపడుతున్న తన శక్తిని పెంచుకోడానికి చైనా-రష్యా ఎదుగుదలను అడ్డుకోవడానికి యుద్ధనాదాలు చేస్తోంది. అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రష్యాకు చెందిన సహ మంత్రులు సెర్గీ లావ్రోవ్, సెర్గీ షోయిగ్లతో ఫోన్లో జరిపిన సంభాషణల్లోను, బైడెన్, పుతిన్ మధ్య సంభాషణల్లోను మాట్లాడిన తీరు అమెరికా తన గురించి తాను అతిగా అంచనా వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని చైనా నార్మల్ యూనివర్సిటీలోని ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ చెన్ హాంగ్ శుక్రవారం గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ అన్నారు.