Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెనడా ప్రధాని వ్యాఖ్యలపై జనాగ్రహం
- హోరెత్తిన నిరసనలు
కెనడా : కోవిడ్ వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంపై కెనడాలో నిరసనలు హోరెత్తిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నిరసనలను అణచివేసేందుకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ''ఎమర్జెన్సీ చట్టాలను'' ఉపయోగిస్తామని చెప్పారు. దీంతో నిరసనలను అణిచివేసేందుకు అత్యంత అరుదుగా ఉపయోగించే ఎమర్జెన్సీ చట్టాలను అమలు చేస్తానన్న జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలపై కెనడాలోని కొన్ని ప్రావిన్స్ లలో తీవ్ర దుమారం రేగింది. నిరసనకారులను అడ్డుకోవడం చేతగాని ప్రభుత్వానికి... చట్టాలను ఉపయోగించుకునే హక్కు ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటే చాలని, ఎమర్జెన్సీ చట్టాలు అమలు చేయాల్సిన అవసరంలేదని అల్బెర్టా, క్యూబెక్, మానిటోబా, సస్కట్చేవాన్ ప్రాంతీయ ప్రధానులు హితవు పలికారు. దీనిపై దేశ ప్రధాని ట్రూడో స్పందిస్తూ.. ఎమర్జెన్సీ చర్యలు.. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చారు.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం మాట్లాడుతూ, ''ఫ్రీడమ్ కాన్వారు'' నిరసనలతో సరిహద్దులు మూసివేయాల్సి వచ్చిందనీ, దేశ రాజధానిలోనూ కొన్ని ప్రాంతాలను నిరసనకారులు స్తంభింపజేశారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, విశ్వసనీయ వ్యాపార భాగస్వామిగా కెనడా ఖ్యాతిని దెబ్బతీస్తున్నాయని అన్నారు. నిరసనల అణచివేతకు పోలీసు బలగాలను విస్తతంగా మోహరింపజేసి.. ప్రభుత్వం నుంచి వివిధ కార్యకలాపాలకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడంతోపాటు.. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ''టెర్రర్ ఫైనాన్సింగ్ పర్యవేక్షణ'' కిందకు తీసుకురావడానికి విస్తత చర్యలు తీసుకోనున్నట్టు జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.