Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుల్లో సడలిన ఉద్రిక్తతలు
- వార్ హిస్టీరియాతో అనవసరపు భయాలు సృష్టించొద్దు :అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు
- దౌత్యమే పరిష్కారమన్న ఐరాస చీఫ్
మాస్కో : ఉక్రెయిన్ను పావుగా చేసుకుని రష్యాను కట్టడి చేయాలని, ఎలాగైనా దానిని సాయుధ ఘర్షణలోకి లాగాలని అమెరికా వేసిన ఎత్తులు చిత్తయ్యా యి. ఉక్రెయిన్తోగల సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను మంగళవారం వెనక్కి రప్పించింంది. తమకు దాడిచేసే ఆలోచనే లేదని రష్యా పదే పదే చెబుతున్నా, సరిహద్దుల్లో అటువంటి పరిస్థితులేవీ కనిపించడం లేదని అమెరికాకు విధేయుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నా పట్టించుకోకుండా రెండ్రోజుల్లో యుధ్దం ఖాయమంటూ అమెరికా, దాని ఆధ్వర్యంలోని మీడియా అదే పనిగా చేసిన ప్రచారం గాలి బుడగలా టప్పున పేలిపోయింది. అయినా, గోబెల్స్ ప్రచారాన్ని అది కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌తో సరిహద్దులో సైనిక కవాతు పూర్తి చేసుకున్న దళాలు తిరిగి తమ స్థావరాలకు చేరుకుంటున్నాయని రష్యా రక్షణమంత్రి ప్రకటించారు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలుతాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాటో దళాల అధిపతి స్పందిస్తూ, రష్యా ప్రకటన ఆశాజనకంగానే ఉన్నదంటూనే, ఉద్రిక్తతలు తొలగుతున్నాయన్న సంకేతాలేవీ ఇంతవరకు కానరాలేదని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ పత్రికా గోష్టిలో మాట్లాడుతూ యూరప్‌లో యుద్ధాన్ని రష్యా కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఉక్రెయిన్ తూర్పు చీలిక రిపబ్లిక్లలో రష్యా మారణ కాండ సృష్టిస్తున్నట్లు అమెరికా ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రష్యా నుంచి మిశ్రమ సంకేతాలు వస్తున్నాయని, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఇచ్చే సమాచారం ఏమంత ప్రోత్సాహకరంగా లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. భద్రతకు సంబంధించి రష్యా లేవనెత్తిన ఆంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇయు పేర్కొంది. రష్యా దాడి చేస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, పైగా లేనిపోని భయాలను సృష్టించి ఉక్రెయిన్ ప్రజలను భయకంపితులను చేయొద్దని అమెరికాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తిగా తమ అదుపులోనే వుందని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి కార్యదర్శి అలెక్సీ డానిలోవ్ ప్రకటించారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జకరోవా ఒక ప్రకటన చేస్తూ, వారాల తరబడి అమెరికా, యురోపియన్ అధికారులు చేస్తున్న ప్రకటనల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేశారు. పొరుగు దేశంపై రష్యా దాడి జరిపేందుకు కొన్ని గంటలే మిగిలాయంటూ ఊకదంపుడు ప్రచారాలు చేసిన నేతలకు ఇప్పుడు వాస్తవం ఏమిటో అర్ధమై వుంటుందని అన్నారు. ''పశ్చిమ దేశాల యుద్ధ ప్రచారం విఫలమైన రోజుగా ఈ రోజు (15వ తేదీ) చరిత్రలో నిలిచిపోతుంది.'' అని ఆమె పేర్కొన్నారు. ఒక్క కాల్పుల ఘటన కూడా జరగకుండానే మొత్తంగా పశ్చమ దేశాలు ఈనాడు సిగ్గుతో తలదించుకుని దెబ్బతిన్నాయన్నారు. మంగళవారం తెల్లవారు జామునే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సిద్ధమవుతోందంటూ పేరు వెల్లడించని అధికారులను ఉటంకిస్తూ శనివారం బ్లూమ్‌బెర్గ్ వార్తా కథనాన్ని వెలువరించింది. ఈ నేపథ్యంలో రష్యా ప్రకటన వెలువడింది. కాగా మరోవైపు ఉక్రెయిన్ సరిహద్దుల్లో నుండి రష్యా తన బలగాలను ఉపసంహరిస్తోంది.గత వారం బెలారస్‌తో కలిసి రష్యా 'యూనియన్ రిజాల్వ్' పేరుతో సంయుక్త విన్యాసాలు .నిర్వహించింది. ఫిబ్రవరి 20 వరకు ఇవి జరగాల్సి వుంది. విదేశీ దురాక్రమణలు తలెత్తిన పక్షంలో వారిని నిలువరించి, పారద్రోలేందుకు గానూ తమ సామర్ధ్యాలను పరీక్షించుకోవడానికి ఈ విన్యాసాలు ఉద్దేశించబడ్డాయని ఆ ప్రకటన పేర్కొంది. మరో వైపు బుధవారం జాతీయ ఐక్యతా దినంగా పాటించనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఆ రోజున దేశమంతా జాతీయ గీతాలాపన జరగాలని ఆదేశించారు. దాడికి సంబంధించి వందశాతమూ కచ్చితమైన సమాచారముంటే పంచుకోవాలని అంతకుముందు జెలెన్స్కీ అమెరికాను కోరారు. ఆ తర్వాత రెండు రోజులకు ఈ ప్రకటన వెలువడింది. రష్యా దళాల ఉపసంహరణతో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సడలాయన్న వార్తతో భారత్ స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ ఒక్కసారిగా 1700 పాయింట్లు పెరిగింది.
ఉద్రిక్తతల నివారణకు దౌత్య మార్గాలు అనుసరించండి : ఐరాస చీఫ్
రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య మార్గాలను అనుసరించాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్ సోమవారం పిలుపునిచ్చారు.