Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుడు సమాచార వ్యాప్తి, ఉద్రిక్తతలను పెంచి పోషించడం తగదు :ఉక్రెయిన్ సమస్యపై చైనా వ్యాఖ్య
బీజింగ్ : తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించడం ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి దోహదపడవని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. గ్రూపులు కట్టి ఘర్షణలకు దిగడం, ఆంక్షలు విధిస్తామని బెదిరించడం వల్ల చర్చల క్రమానికి మరింత అవరోధాలు కలుగుతాయని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగుతోందంటూ అమెరికా చేసిన ప్రచార హోరుపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతకు సంబంధించి రష్యా వ్యక్తం చేస్తున్న చట్టబద్ధమైన ఆందోళనలను అమెరికా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని చైనా సూచించింది. ఇలా ఉద్రిక్తతలు పెంచుతూ సంక్షోభాన్ని ఉధృతం చేసే బదులు ఉక్రెయిన్ విషయంలో కొత్త మిన్స్క్ ఒప్పందం ప్రాతిపదికగా రాజకీయ పరిష్కారం కోసం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని అమెరికాను కోరింది. కొత్త మిన్స్క్ ఒప్పంద స్ఫూర్తితో ఆ దిశగా సాగే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతిస్తుందని వాంగ్ స్పష్టం చేశారు. కాగా, ఇన్ని బూటకాలు, ఇంత తప్పుడు సమాచారం వ్యాప్తి, దూషణలు, అబద్ధాలు ఇంత సుదీర్ఘకాలం కొనసాగించడం తానెన్నడూ చూడలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మారియా జకరోవా బుధవారం నాటి పత్రికా సమావేశంలో వ్యాఖ్యానించారు. సిరియాలో పరిస్థితిపై ప్రచారం చేసిన బూటకపు సమాచార స్థాయిని అధిగమించేలా ఉక్రెయిన్ విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికా శాయశక్తులా ప్రయత్నించిందని, దీనికి పశ్చిమ మీడియా ఇతోధికంగా సహకరించిందని విమర్శించింది. కాగా అమెరికా ఇంకా రష్యాపై తన విమర్శల జోరును ఆపలేదు.