Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ హితవు
- పుతిన్, జెలెన్స్కీతో ఫోన్లో చర్చలు
కైవ్ : ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభానికి తక్షణమే తెరదించాలని ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ హితవు పలికారు. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ, ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీతో ఆయన విడివిడిగా ఆదివారం ఫోన్లో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌లో సంక్షోభ నివారణకు సాధ్యమైనంత చివరి ప్రయత్నంగా ఈ ఫోన్ సంభాషణను ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం అభివర్ణించింది. రష్యా 'రెచ్చగొడుతోందన్న' తన ఆరోపణలపై ఇప్పటికీ మాస్కో నుంచి బదులు రాలేదనీ, సంక్షోభ పరిష్కారానికి మాస్కోలో అయినా సరే చర్చలకు తాము సిద్ధమని జెలెన్స్కీ ఆదివారం ట్వీట్ చేశారు. ఇదే విషయాన్ని మాక్రాన్‌కు కూడా తాను స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దౌత్యపరమైన పరిష్కారం కోసం ఇదివరకే పుతిన్‌తో కూడా జెలెన్స్కీ ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఏ దశలోనూ రష్యాకు మరొకరిపై దాడి చేసే ఉద్దేశమే లేదని పుతిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ చెప్పారు. అలాంటి చరిత్ర కూడా రష్యాకు లేదని, ప్రపంచం యుద్ధ సమయంలో సైతం అందరితో చర్చలే ముద్దని చెప్పిన ఆఖరి యూరప్ దేశం కూడా రష్యానే అని డిమిట్రీ పేర్కొన్నారు.
కొనసాగుతున్న ఉద్రిక్తత
మరోవైపు ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా మద్దతు ఉందని అమెరికా ఆరోపిస్తున్న వేర్పాటువాద బలగాల ఆధీనంలో ఉన్న భూభాగానికి, ప్రభుత్వ బలగాలు మోహరించిన భూభాగానికి మధ్య ఉన్న ప్రాంతంలో శనివారం పేలుళ్లు చోటుచేసుకోగా, ఇదే ప్రాంతంలోని వందలాది చోట్ల ఆదివారం కూడా పేలుళ్లు జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈశాన్య ఉక్రెయిన్ నుంచి వేలాది మంది పౌరులను రక్షిత శిబిరాలకు తరలించారు. ఈ ప్రాంతం నుంచి ఏక్షణమైనా రష్యా చొరబడవచ్చు అంటూ అనేక కథనాలను అమెరికా అనుకూల మీడియా వ్యాప్తి చేస్తోంది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు వీలుగా ఉన్న మూడు మార్గాల వెంబడి రష్యా 1.5 లక్షల మంది సైనికులను, యుద్ధ విమానాలను, ఆయుధ సామాగ్రిని మోహరింపజేసిందని పశ్చిమ దేశాల నాయకులు పేర్కొంటున్నారు. రష్యా శనివారం అణు పరీక్షలు నిర్వహించడం, ఆదివారం కూడా నల్ల సముద్రంలో నేవీ విన్యాసాలు కొనసాగించడం ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందని వారు ఆరోపించారు.