Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ సమయంలో 1.1కోట్లమంది బాలికలు చదువుకు దూరం
- పెరిగిన లింగ అసమానతలు, బాల్య వివాహాలు : యునెస్కో
- పేదలు, అణగారిన వర్గాల పిల్లలపై తీవ్ర ప్రభావం
- విద్యారంగంలో సమూల మార్పులు చేపట్టాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు సూచన
పారిస్ : కోవిడ్ -19 సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, దాదాపు 1.1 మంది బాలికలు పాఠశాల విద్యకు దూరమయ్యారని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. లింగ అసమానతలు, బాల్య వివాహాల పెరిగాయని, ఈ విషయంలో గత కొన్నేండ్లుగా సాధించినదంతా దెబ్బతిన్నదని తెలిపింది. భారత్‌లో పేదలు, అణగారిన వర్గాల పిల్లలపై తీవ్ర ప్రభావం పడిందని, ఒకటి, రెండు తరగతులకు చెందిన ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు తిరిగి పాఠశాలకు రావటం లేదని తెలిపింది. విద్యారంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించకపోతే ముందు ముందు అనేక సమస్యలు వస్తాయని, విద్యారంగంలో సమూలు మార్పులు చేపట్టాలని భారత్ సహా పలు దేశాల్ని యునెస్కో హెచ్చరించింది. విద్యా హక్కును పరిరక్షించటం కోసం 'గ్లోబల్ ఎడ్యుకేషన్ కూటమి' పేరుతో ఒక వేదికను యునెస్కో ఏర్పాటుచేసింది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లోని పౌర హక్కుల కార్యకర్తల్ని, విద్యావేత్తల్ని, మేధావుల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కోవిడ్ సంక్షోభం విసురుతున్న సవాళ్లను ఎలా పరిష్కరించాలన్నదానిపై వీరు చర్చించాలని పిలుపునిచ్చింది.
కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచంలో 3.8కోట్లమంది చిన్నారులు స్కూల్స్‌కు రావటం లేదు. స్కూల్స్‌కు రాలేకపోతున్న పిల్లల్లో ఎక్కువగా పేదలు, అణగారిన వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఈ ప్రతికూల ప్రభావం వారి జీవితమంతా ఉంటుంది. కోవిడ్ కారణంగా ఏర్పడ్డ అడ్డంకుల్ని తొలగించకపోతే సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 180 లక్ష కోట్ల గంటల బోధనను విద్యార్థులు కోల్పోయారని అంచనావేస్తున్నాం. కుటుంబ సమస్యలు, పాఠశాలల మూసివేత కారణంగా అదనంగా 10కోట్లమంది బాలల చదువు దెబ్బతిన్నది. వారి కనీస విద్యా నైపుణ్యాలు తగ్గాయి.
భారత్‌పై ప్రభావం
కోవిడ్ సంక్షోభ ప్రభావం గ్రామీణ బాలలు, యువతపై ఎక్కువగా పడింది. స్మార్ట్ఫోన్లు లేకపోవటం, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేకపోవటం వల్ల అనేక మంది బాలలు పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఆగస్టు 2021నాటి సర్వే ప్రకారం, గ్రామాల్లో ఆన్లైన్ పాఠాల్ని కేవలం 8శాతం బాలలే విన్నారు. ఆన్లైన్ క్లాసుల్ని పూర్తిగా విననివారు 37శాతం మంది ఉన్నారు. శాంపిల్ సర్వేలో సగం మంది బాలలు నిరక్షరాస్యులేనని తేలింది. తమ పిల్లలు ఆన్లైన్ తరగుతులు పొందలేకపోతున్నారని 75శాతం తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చదవటం, రాయటం తగ్గిపోయిందని తెలిపారు.
నష్ట నివారణ చేపట్టాలి..
కోవిడ్ సంక్షోభం చేసిన గాయాల నుంచి విద్యారంగాన్ని కోలుకునేలా చేయాలి. ప్రభుత్వాలు సమూల మార్పులు చేపట్టాలి. పేదలు, అణగారిన వర్గాల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రామాల్లో, మారు మూల ప్రాంతాల్లో విద్యకు దూరమైన బాలబాలికల్ని తిరిగి పాఠశాలకు వచ్చేట్టు చేయాలి. కోవిడ్ తర్వాత స్కూల్స్‌కు రానటువంటి వారిని గుర్తించాలి. వారి విద్యా హక్కుల్ని పరిరక్షించాలి.