Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద సూస్సే సీక్రెట్స్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ కీలక సమాచారం
- నియంతలు, క్రిమినల్స్, డ్రగ్, మాఫియా లీడర్లకు బ్యాంక్ ఖాతాలు : జర్మనీ వార్తా పత్రిక
జ్యూరిచ్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంకుల్లో ఒకటైన 'క్రెడిట్ సూస్సే' అక్రమాలు బయటపడ్డాయి. వివిధ దేశాలకు చెందిన నియంతలు, యుద్ధ నేరగాళ్లు, డ్రగ్ మాఫియా లీడర్లు, రాజకీయ అవినీతిపరులకు 'క్రెడిట్ సూస్సే'లో రహస్య బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని, బయటి ప్రపంచానికి తెలియకుండా అక్రమంగా దాచుకున్న సొమ్ము సుమారుగా 109బిలియన్ డాలర్లు(సుమారుగా రూ.8.1లక్షల కోట్లు) ఉంటుందని పరిశోధనాత్మక జర్నలిజంలో బయటపడింది. మారు పేర్లతో, దొంగ పేర్లతో ఈ బ్యాంక్‌లో పెద్ద సంఖ్యలో రహస్య ఖాతాలున్న సంగతి లీక్ అయ్యింది. సొమ్మును దాచుకోవడానికి వచ్చినవారు క్రిమినల్స్, మాఫియా లీడర్స్, అక్రమార్కులు..అనేది ముందే తెలిసినా.. వారికి క్రెడిట్ సూస్సే బ్యాంక్ ఖాతాలు ఇచ్చిందని తెలుస్తోంది. 'ఆర్గనైజ్డ్ క్రైం, కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' పేరుతో నిర్వహించిన ఈ పరిశోధన ప్రాజెక్ట్ వివరాల్ని జర్మనీ దినపత్రిక 'ఎస్జెడ్' సోమవారం విడుదల చేసింది. 18వేలకుపైగా రహస్య ఖాతా వివరాల్ని గుర్తించినట్టు ప్రాజెక్ట్ తెలిపింది. జర్మనీ వార్తా పత్రిక ఎస్జెడ్, మీడియా సంస్థ ఎన్డీఆర్, డబ్ల్యూడీఆర్,గార్డియన్, న్యూయార్క్ టైమ్స్..మొదల ైన 40కిపైగా మీడియా ఆర్గనైజేషన్స్ ఈ పరిశోధనాత్మక జర్నలిజంలో పాలుపంచుకున్నాయి.
ప్రభుత్వాధి నేతలు, నిఘా అధికారులకూ..
ఫిలిప్పైన్స్‌లో మానవ అక్రమ రవాణా చేపట్టేవారికి, జైలు పాలైన హాంకాంగ్ స్టాక్ మార్కెట్ బాస్‌కు, ఈజిప్ట్‌కు చెందిన అత్యంత ధనికుడికి 'క్రెడిట్ సూస్సే'లో ఖాతాలున్నాయి. ఆయా దేశాల్లోని ప్రభుత్వాధినేతలకు,వారి మంత్రివర్గంలో కీలక నేతలకు,నిఘా అధికారులకూ ఇందులో ఖాతాలున్నా యిని తేలింది.బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మోసగాళ్లూ ఇందులో పెద్దమొత్తంలో రహస్యంగా డబ్బులు దాచుకున్నారని సమాచారం. ఉదాహరణ కు..జర్మనీ కంపెనీ 'సిమెన్స్' మాజీ మేనేజర్ అవినీతి కేసులో 2008లో శిక్షపడగా, అతడికి క్రెడిట్ సూస్సేలో 8 ఖాతాలున్నాయి. జోర్డాన్ కింగ్ అబ్దుల్లా-2, ఇరాక్ మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి అయ్యాద్ అల్లావీ, అల్జీరియా నియంత అబ్దెలాజీజ్ బోటెఫ్లికా, అర్మేనియా మాజీ అధ్యక్షుడు అర్మేన్ సర్కీస్సియన్..మొదలైనవారికి రహస్య ఖాతాలున్నాయని జర్మనీ పత్రిక ఎస్జెడ్ పేర్కొన్నది.
రహస్య ఖాతాలు 30వేలు!:అక్రమాలు, అవినీతితో కూడిన సొమ్మును దాచుకోవడానికి అంగీకరించటం లేదని గత రెండు దశాబ్దాలుగా క్రెడిట్ సూస్సే చెబుతోంది. అయితే తాజాగా లీకైన ఖాతాల వివరాలనుబట్టి అది అబద్ధమని తేలింది. 30వేలకు పైగా రహస్య ఖాతాల వివరాలు లీక్ కాగా, ఇందులో ఖాతాదార్ల వివరాలు కనుగొనే ప్రయత్నం జరిగింది. వివిధ దేశాల్లోని నియంతలు, డ్రగ్, మాఫియా లీడర్లు,రాజకీయ అవినీతిపరులు, మానవ అక్రమరవాణా చేపట్టే గ్యాంగులు, ఖూనీకోర్లు..ఇలాంటి వారందరీకి ఇందులో ఖాతాలున్నాయని తేలింది. ఖాతాల్లో 75శాతం 2000సంవత్సరం తర్వాత ప్రారంభంకాగా, ఇప్పటికీ అందులో లావాదేవీలు జరుగుతున్నాయి.
ఇదేమీ మొదటిది కాదు!:తాజా కుంభకోణంపై క్రెడిట్ సూస్సే బ్యాంక్ యాజమాన్యం నిరాకరించింది. పరిశోధనాత్మక జర్నలిజంలో పాల్గొన్న పాత్రికేయులు క్రెడిట్ సూస్సే మాజీ ఉద్యోగులను సంప్రదించగా, వారు ఏమన్నారంటే..''వివిధ దేశాల్లో కార్పొరేట్ కల్చర్ పెద్దఎత్తున విస్తరించింది. వారికి లభించే ప్రయోజనాలు, లాభాలు...ఇక్కడికి వచ్చి చేరుతాయి. ధనికులు, అత్యంత ధనికులు ఇందులో ఖాతాలు తెరిచారు. స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ చట్టాలే ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో పన్ను ఎగవేతదారులు ఈ బ్యాంక్‌ను ఆశ్రయిస్తున్నారు'' అని చెప్పారు. గత రెండు దశాబ్దాల్లో క్రెడిట్ సూస్సేలో అనేక కుంభకోణాలు బయటపడ్డాయి. వీటికి సంబంధించిన కేసుల్లో జరిమానాల రూపంలో బ్యాంక్ దాదాపు 10 బిలియన్ డాలర్లు (సుమారుగా రూ.74వేల కోట్లు) కట్టింది.