Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర దేశాల్ని కోరిన పుతిన్
- నో కామెంట్ : ఐరాసలో భారత్
- కఠిన ఆంక్షలు తప్పవంటూ అమెరికా, బ్రిటన్ తీవ్ర ఆగ్రహం
మాస్కో : తూర్పు ఉక్రెయిన్‌లో రెబల్స్ ఏర్పాటుచేసుకున్న ప్రాంతా లు డోనెట్స్క్, లుహాన్స్క్లను గుర్తించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాల్ని కోరారు. ఈ రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తూ..రిపబ్లిక్‌గా గుర్తింపు ఇస్తూ పుతిన్ చేసిన ప్రకటనపై పాశ్చాతదేశాలు మండిపడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పటానికి తమ సైనిక బలగాలను పంపుతున్నామని పుతిన్ మంగళవారం ప్రకటించారు. ఇదిలా ఉండగా..ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఐరాసలో భారత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో చోటుచేసుకున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పుతిన్ చేసిన ప్రకటనపై ప్రస్తుతానికి 'నో కామెంట్' అని చెప్పారు. దౌత్యపరమైన చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించాలని సూచించారు. ''ప్రపంచ దేశాల రక్షణ, భద్రతా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉద్రిక్తతలను వెంటనే చల్లార్చాలి. ఉక్రెయిన్‌లో శాంతిసామరస్యం ఏర్పడేందుకు చర్యలు చేపట్టాలి'' అని తిరుమూర్తి అన్నారు. రష్యాపై ఇప్పటివరకూ కొనసాగిస్తున్న విధానాన్నే ఎంచుకున్నామని పరోక్షంగా ఆయన సంకేతాలు ఇచ్చారు. మిన్స్క్ ఒప్పందాన్ని ఆధారంగా చేసుకొని సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. రష్యా, ఉక్రెయిన్, యూరప్ దేశాలతో కూడిన త్రైపాక్షిక చర్చలు జరిపితే బాగుంటుందని పేర్కొన్నది. రష్యాకు చెందిన రోసియా బ్యాంక్, ఐఎస్, జనరల్, ప్రోమ్సివిజ్, బ్లాక్ సీ..బ్యాంకులపై ఆంక్షలు విధించబోతున్నట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆ దేశపార్లమెంట్లో తెలిపారు. మరిన్ని ఆంక్షలు రష్యాపై విధించబోతున్నామని అన్నారు. అలాగే రష్యాకు చెందిన ముగ్గురు బిలియనీర్లపైనా బ్రిటన్ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో వారి ఆర్థిక కార్యకలాపాల్ని, బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపజేస్తున్నామని, వారి రాకపోకల్ని నిషేధిస్తున్నామని తెలిపింది.
ఆ ప్రాంతాలకు రష్యా బలగాలు
శాంతిపరిరక్షణ కోసం డోనెట్స్క్, లుహాన్స్క్‌లకు రష్యా సైనిక ట్యాంకులు, ఇతర సైనిక వాహనాలు వెళ్తున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. డోనెట్స్క్కు సమీపంలో ఐదు, నగరంలో మరో 2 యుద్ధ ట్యాంకులు కనిపించాయని పేర్కొన్నది. అయితే ఆ వాహనాలపై ఎలాంటి చిహ్నాలు లేవని వివరించింది. అయితే డోనెట్స్క్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అక్కడి రెబల్స్‌కు ఉక్రెయిన్ సైన్యానికి మధ్య కాల్పులతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఇండ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో డోనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తిస్తూ పుతిన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పైనా ఆయన సంతకం చేశారు. ఈ రెండు ప్రాంతాల్ని రిపబ్లిక్ పీపుల్ ఆఫ్ స్టేట్స్‌గా వాటిని గుర్తించామని ప్రకటించారు. ఇకపై ఈ రెండు ప్రాంతాల్లో పరిపాలనతో ఉక్రెయిన్ ప్రభుత్వానికి సంబంధాలు ఉండబోవని తేల్చి చెప్పారు. రష్యా తీరుపై అమెరికా, బ్రిటన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్నాయి. రెబల్స్ ఏర్పాటుచేసుకున్న రెండు స్వతంత్ర ప్రాంతాల రక్షణ, ప్రాదేశిక సమగ్రతకు తాము కట్టుబడి ఉంటామని రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావరోవ్ అన్నారు. ఇకపై ఆ రెండు ప్రాంతాలు స్వతంత్ర హోదాను కలిగివున్నాయని, అక్కడి నాయకులు రష్యాతో మెరుగైన సంబంధాలు కలిగివున్నారని ఆయన అన్నారు. స్నేహం, సహకారం, పరస్పర సాయంపై ఇరు ప్రాంతాలకు, రష్యాకు మధ్య అవగాహన కుదిరిందని, దీనిని అందరూ అర్థం చేసుకోవాలని లావరోవ్ చెప్పారు.