Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య
డాన్‌బాస్‌లో స్పెషల్ ఆపరేషన్‌తో రష్యా రణభేరి మోగించింది. బలగాలు ముప్పేట దాడికి దిగాయి. దీంతో రష్యాతో ఉక్రెయిన్ దౌత్యసంబంధాలు తెగిపోయాయి. రష్యా సైనిక చర్యపై పలు దేశాలు ఖండించగా.. తీవ్ర పర్యవసానాలు తప్పవన్న అమెరికా, మిత్ర దేశాలు హెచ్చరిక చేశాయి. రష్యాకు మా మద్దతు అవసరంలేదని చైనా స్పష్టం చేసింది. మరోవైపు ఉక్రెయిన్ భారత్ సాయం కోరింది. శాంతికి ఒక అవకాశం ఇవ్వాలని యూఎన్ చీఫ్ కోరారు.యుద్ధవాతావరణంతో ఉక్రెయిన్‌లో ఉంటున్న ఇతర దేశాలకు చెందిన ప్రజలు, స్థానికులు భయాందోళనకు గురై..సరిహద్దులు దాటటానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆ దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ ఆర్థికంపై ప్రభావం పడనున్నదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మాస్కో, కీవ్, వాషింగ్టన్ : రష్యా రణభేరి మోగించటంతో.. టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. డాన్‌బాస్‌లో మిలటరీ ఆపరేషన్‌కు చర్యలు తీసుకోవాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. పుతిన్ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే ఉక్రెయిన్‌పై గురువారం తెల్లవారు జామున దాదాపు 5గంటల నుండి దాడులు ప్రారంభమయ్యాయి. ''నిర్ణయాత్మకమైన, తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.'' అని పుతిన్ జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నాయి. సాయం కోసం డాన్బాస్ ప్రాంతంలోని పీపుల్స్ రిపబ్లిక్లు చేసిన అభ్యర్ధన మేరకు తాము చర్యలు చేపట్టినట్లు పుతిన్ ప్రకటించారు. అదే సమయంలో ప్రజలనుద్దేశించి కూడా పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ ప్రాంతంగా, నాజీల రహిత ప్రాంతంగా మార్చాలన్నది తమ అభిమతమని చెప్పారు. ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకునే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది క్షణాల్లోనే ఉక్రెయిన్‌వ్యాప్తంగా పలు నగరాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. రాజధాని కీవ్‌లో కూడా పేలుళ్ళు జరిగినట్టు మీడియా వార్తలు పేర్కొన్నాయి. ఎక్కడా తమకు ఉక్రెయిన్ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవటం లేదని మాస్కో తెలిపింది. కాగా మరోవైపు రష్యా చర్యను ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు ఖండించారు. అమెరికా, మిత్ర దేశాలు ఈ చర్యను ఖండిస్తూ, ఇందుకు రష్యా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించాయి. ముందుగా అనుకున్న ప్రకారమే పుతిన్ యుద్ధానికి దిగారంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా, దాని మిత్రపక్షాలు ఈ చర్యపై నిర్ణయాత్మకంగా, సమైక్యంగా ప్రతిస్పందిస్తాయని చెప్పారు. తాజా పరిణామాలపై ఉక్రెయిన్ అధ్యక్షునితో చర్చించినట్లు చెప్పారు. గురువారం ఉదయం బైడెన్ జి7 దేశాల నేతలతో సమావేశం కావడానికి ముందుగా మాట్లాడారు. నాటో మిత్రపక్షాలను కూడా కూడగట్టుకుని బలమైన సమాధానం చెబుతామని చెప్పారు. రష్యా సైనిక చర్యపై చైనా స్పందిస్తూ, రష్యా చేపట్టిన ఆపరేషన్‌కు తమ మద్దతు లేదని, అయినా మాస్కోకు ఆ అవసరం కూడా లేదని వ్యాఖ్యానించింది. ఈ దాడికి తమ మద్దతు వుండివుండవచ్చ ంటూ అమెరికా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో చైనా స్పందించింది. ప్రచ్చన్న యుద్ధ మనస్తత్వాన్ని చైనా అనుసరించదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్య వార్త నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. భారీ నష్టాలను చవి చూశాయి. తాజా సంక్షోభం వెండి, బంగారం ధరలపై కూడా పడింది. వాటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్, భారత్ సాయాన్ని కోరింది. ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని, క్లిష్టమైన ఈ పరిస్థితుల్లో తమకు బాసటగా నిలవడాలని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఇగర్ పొలిఖా కోరారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి బలగాలను పంపడం నిలుపుచేయాలని, శాంతికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటానియో గుటెరస్ రష్యాను కోరారు. రష్యాచర్య నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలను సమీక్షించింది.
సైనిక స్థావరాలే లక్ష్యంగా...
ఉక్రెయిన్‌లో సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. వైమానిక స్థావరాలు, మిలటరీకి చెందిన ఇతర పరికరాలు, సామాగ్రి అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను రష్యా రక్షణ శాఖ తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌లోని వైమానిక స్థావరాలను తమ అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. ఈమేరకు గురువారం అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఉక్రెయిన్ సాయుధ బలగాల వైమానిక స్థావరాలన్నీ నిర్వీర్యమయ్యాయని స్పష్టం చేసింది.
12 విమానాశ్రయాలు మూసివేత
రష్యా దక్షిణ ప్రాంతంలోని 12 విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నిలిపివేసింది. తాత్కాలికంగా ఈ నిలిపివేత చర్యలు తీసుకున్నట్టు అధికార వెబ్సైట్లో పేర్కొంది. మార్చి 2 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.
ఆ ఉద్దేశం లేదు : పుతిన్
- ప్రజలను రక్షించడమే లక్ష్యం
ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గురువారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దాడి నుంచి డొనెట్స్క్, లుహాన్క్స్లను రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌కు ఉత్తర్వులు జారీ చేసిన ఆయన... ఎనిమిదేండ్లుగా కీవ్ పరిపాలన మారణహౌమానికి గురైన ప్రజలను రక్షించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని అన్నారు. ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలను,సైనిక చర్యలను నిర్వీర్యం చేయడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.పౌరులపైదౌర్జన్యానికి పాల్పడుతున్న వారి పట్ల సహించలేది లేదని అన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికలేవీ లేవని పేర్కొన్నారు. అలాంటి ఉద్దేశాలూ లేవని, బలవంతపు చర్యలకు దిగే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
ఆయుధాలిస్తాం..రండి
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్నట్టు జాతీయ టెలివిజన్‌లో ఒక ప్రకటన చేశారు. దేశ రక్షణ కోసం ముందుకొచ్చేవారి చేతులకు ఆయుధాలిస్తామంటూ ప్రకటించారు. జాతీయ సాయుధ బలగాలకు సహకరించాల్సిందిగా ప్రజలను కోరారు. అవసరమైతే పోరాటానికి సిద్ధం కావాలంటూ ఉద్బోధించారు. సమాచార సేకరణను సమగ్రంగా నిర్వహిచండం ద్వారా జాతీయ ఐక్యతకు మద్దతునివ్వాల్సిందిగా దేశ మీడియాను అధ్యక్షుడు కోరారు. కాగా, రష్యా, బెలారస్ సరిహద్దుల నుంచి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షక దళం తెలిపింది. లుగాన్స్క్, సుమీ, ఖర్కోవ్, చెర్నిలివ్, జైటోమిర్ ప్రాంతాలు లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. బెలారస్ వైపు నుండి ఉక్రెయిన్‌లోకి యుద్ధ ట్యాంకులు, సరిహద్దులు దాటి క్రిమియాలోకి రష్యా బలగాలు వస్తున్న సీసీటీవీ ఫుటేజీని మీడియా ప్రసారం చేసింది. సరిహద్దు యూనిట్లు, చెక్పాయింట్లపై శతఘ్నులతో, భారీ ఆయుధాలతో, తుపాకులతో దాడులు కొనసాగుతు న్నాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షక దళం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. పూర్తి స్థాయి దాడిని రష్యా చేపట్టిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిరతో కులేబా ప్రకటించారు. ప్రశాంతంగా వుండే నగరాలు దాడులకు గురవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు.