Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యా బృందాన్ని మిన్స్క్కు పంపుతాం : పుతిన్ కార్యాలయం ప్రకటన
- సానుకూలంగా స్పందించిన ఉక్రెయిన్
- చర్చలు జరపాలని పుతిన్‌కు సూచించిన జీ జిన్‌పింగ్
- రెండో రోజూ భీకర యుద్ధం
- భారతీయులను తరలించేందుకు విమానాలు పంపుతున్నాం : కేంద్రం
మాస్కో : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నవేళ రెండోరోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చర్చలు జరపడానికి సిద్ధమని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సుముఖత వ్యక్తం చేశాయి. శుక్రవారం చర్చలపై తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. ఇందుకోసం బెలారస్ రాజధాని మిన్స్క్కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని ఆయన కూడా సూచించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ నుంచీ కీలక ప్రకటన వెలువడింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్ తెలిపింది.
యుద్ధంలో వెయ్యిమందికిపైగా రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ రక్షణశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రష్యా సైనికుల మృతిపై ప్రకటన జారీచేసింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించాయి. కీవ్ వెలుపల ఉన్న వ్యూహాత్మక విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో రష్యా సేనల్ని నిలువరించేందుకు ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తున్న రష్యా తీరును బ్రిటన్, ఇతర ఈయూ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగమంత్రి లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు ఐరోపా సమాఖ్య అంగీకారం తెలిపింది. యూరప్ దేశాల్లో వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని ఈయూ నిర్ణయించింది.
రెండో రోజు
ఉక్రెయిన్‌పై రెండో రోజు రష్యా భీకర యుద్ధం కొనసాగిస్తోంది. రాజధాని కీవ్ నగరం సహా ప్రధాన నగరాలపై మొదలైన భీకర దాడుల్లో 137మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్టు అంచనా. ఉక్రెయిన్ భూతలంపై ఉన్న 118 మిలటరీ లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. రెండో రోజూ భూ, ఆకాశ, సముద్రమార్గాల్లో రష్యా సైనిక దాడులు జరుగుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్‌లో ఏర్పడిన భారీ సంక్షోభం ఇది. గురువారం మొదలైన యుద్ధంతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచం తమను ఒంటరిగా వదలేసిందని, పట్టించుకోవటం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా యుద్ధానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూసిన ప్రపంచం తల్లడిల్లిపోతోంది. ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంయమనం పాటించాలని రష్యాను కోరుతున్నారు.
భారతీయులను తరలించేందుకు విమానాలు రెడీ : ప్రభుత్వ వర్గాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులన స్వదేశానికి తరలించేందుకు విమానాలు రెడీ అవుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిందని సమాచారం. ఉక్రెయిన్‌లో దాదాపు 16వేలమంది భారతీయులు చిక్కుకుపోయినట్టు అంచనా. అక్కడ్నుంచి భారతీయుల్ని తరలించేందుకు రెండు విమానాలను పంపనున్నారు. తరలింపునకు సంబంధించి తదుపరి వ్యూహాల రూపకల్పనపై చర్చించేందుకు కేంద్ర మంత్రివర్గ కమిటీ నేడు మధ్యాహ్నం సమావేశం కానుంది. శుక్రవారం రాత్రి రొమేనియాకు బయల్దేరిన విమానాలు మంగళవారం భారతీయులతో తిరిగి రావాల్సి ఉంది. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేసిన తర్వాత భారత పౌరులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. భారతీయుల తరలింపులో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలైన హంగేరీ, పోలండ్, స్లోవిక్ రిపబ్లిక్, రొమేనియాల సాయం తీసుకోవాలని, అక్కడికి అధికార బృందాలను పంపుతున్నామని విదేశాంగ కార్యాలయం తెలిపింది.
రహస్య బంకర్లోకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ!
కీవ్ నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టడంతో ఉక్రెయిన్ భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దేశాధ్యక్షుడు జెలెన్స్కీని బంకర్లోకి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. తమ అధ్యక్షుడ్ని కాపాడుకునేందుకు భద్రతా దళాలు ఆయన్ను తరలించినట్టు తెలుస్తోంది. అంతకుముందు తమ దేశంపై రష్యా దాడిని యావత్ ప్రపంచం ఓ ప్రేక్షకుడిలా చూస్తోందని జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కీవ్‌లోకి రష్యా బలగాలు ప్రవేశించినట్టు ప్రకటించిన ఆయన, శత్రుసేనల్ని ఒంటరిగానే ఎదుర్కొంటున్నామని అన్నారు. అత్యంత శక్తివంతమైన దేశం దూరం నుంచి చూస్తోందని అమెరికా తీరును తప్పుబట్టారు.
పుతిన్‌కు జిన్‌పింగ్ ఫోన్
రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతున్నవేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్ ఉక్రెయిన్ పరిస్థితులను జిన్‌పింగ్‌కు వివరించగా, ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని పుతిన్‌ను జిన్‌పింగ్ కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ నాటో, యూరప్ దేశాలు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు.