Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, చైనా, యూఏఈ.. గైర్హాజరు
- దౌత్యమార్గం ఒక్కటే సమాధానమని భారత్ వెల్లడి
- కీవ్ మా ఆధీనంలోనే ఉంది : ఉక్రెయిన్ అధ్యక్షుడు
- రష్యాపై ఒత్తిడి పెంచాలంటూ ప్రధాని మోడీని కోరిన జెలెన్స్కీ
ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ చర్యలను ఆపేలా ఒత్తిడి తేవాలని ప్రపంచ దేశాలను ఉక్రెయిన్ సాయం కోరింది. శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీని కోరారు. ఈ విషయంపై జెలెన్స్కీ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. లక్షమంది దురాక్రమణదారులు తమ భూభాగంలోకి చొరబడ్డారని, ఇలాంటి తరుణంలో ఐరాస భద్రత మండలిలో తమకు రాజకీయంగా మద్దతు పలకాలని భారత్‌ను జెలెన్స్కీ కోరారు. మరోవైపు..చర్చలకు రాకుండా సంక్షోభాన్ని ఉక్రెయిన్ మరింతగా సాగదీస్తోందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూయార్క్ : ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిలిపివేయాలని రష్యాకు గట్టిగా చెప్పేందుకు శుక్రవారం అమెరికా ప్రతిపాదించిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగగా.. భారత్, చైనా, యూఏఈ దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీర్మానం తీవ్రంగా ఖండించింది. తక్షణమే రష్యా తన దళాలను ఉపసంహరించుకోవాలని, కాల్పులను వెంటనే విరమించాలని కోరింది. అయితే భద్రతా మండలిలో శాశ్వతసభ్య దేశంగా తనకు గల వీటో అధికారాన్ని ఉపయోగించి..రష్యా ఆ తీర్మానాన్ని వీగిపోయేలా చేసింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన దేశాలన్నీ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు తీసుకెళ్తామని చెప్పాయి. రష్యాను జవాబుదారీ చేస్తామని తెలిపాయి. భద్రతా మండలిలో 15దేశాలకు సభ్యత్వం ఉంది. వీటిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు కాగా, మిగిలినవి తాత్కాలిక సభ్య దేశాలు. అమెరికా నేతృత్వంలోని దేశాలు ప్రతిపాదించిన తీర్మానానికి 11ఓట్లు అనుకూలంగా వచ్చాయి. రష్యా వీటో చేసింది. భారత్, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
దౌత్యమార్గమే శరణ్యం : భారత్
ఐరాసలో తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా..భారత్ స్పందనను రష్యా ప్రశంసించింది. స్వతంత్రమైన, సమతుల్యంతో కూడిన విధానాన్ని భారత్ ఎంచుకుందని..భారత్‌లోని రష్యా రాయబార కార్యలయం పేర్కొన్నది. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ అధికారిక కార్యా లయం దీనిపై స్పందించింది. ''ఉక్రెయిన్‌లో పరిణామాలపై భారత్ తీవ్రంగా కలత చెందింది. విభేదాలు, వివాదాలు పరి ష్కరించుకోవడానికి చర్చలు మాత్రమే ఏకైక సమాధానం. స్థిరమైన, సమతుల్యమైన ఈ వైఖరిని కొనసాగిస్తాం. ఉక్రెయిన్-రష్యా దౌత్య మార్గానికి తిరిగి రావాలని కోరుతున్నాం''అంటూ పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
రష్యా సేనల ప్రణాళిక విఫలం : జెలెన్స్కీ
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. పుతిన్ తన ప్రభుత్వాన్ని కూలదోసి, ఒక తోలుబొమ్మను కొలువుతీర్చాలని చూస్తోందని ఆరోపించారు. తమపై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తోన్న దాడిని ఆపేలా రష్యన్లు ఒత్తిడి తేవాలని కోరారు. అలాగే ఈ సైనిక చర్యను వ్యతిరేకిస్తోన్న రష్యన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ''రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్ ఇప్పటికే ఉక్రెయిన్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి'' అని జెలెన్స్కీ తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యన్ సేనలు క్షిపణులు, ఫైటర్స్, డ్రోన్లు, ఫిరంగిదళాలు, సాయుధ వాహనాలు, విధ్వంసకారులు, వైమానిక దళాల''ను మోహరించాయి. నివాస ప్రాంతాలపై కూడా దాడి చేశాయని మండిపడ్డారు. కీవ్‌తో సహా ప్రధాన నగరాల్లో ఉక్రేనియన్లు రష్యన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని వెల్లడించారు. మరికొన్ని నగరాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని తెలిపారు.
సైనిక చర్యను వ్యతిరేకించిన రష్యన్లకు కృతజ్ఞతలు
అలాగే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరే హక్కును ఉక్రెయిన్ ఇప్పటికే పొందిందని, ఈయూ నేతలు అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని జెలెన్స్కీ కోరారు. అంతేగాకుండా స్విఫ్ట్ నుంచి రష్యాను డిస్కనెక్ట్ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిం దన్నారు. జర్మనీ, హంగేరీ కూడా ఇప్పుడు ఆ ధైర్యం చేస్తాయ న్నారు. ఇంకోపక్క ఈ సైనిక చర్యను వ్యతిరేకించిన రష్యన్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తీరుగా పుతిన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని అభ్యర్థించారు. మనకు, ఈ ప్రపం చానికి అబద్ధాలు చెప్పేవారిని నిలువరించాలని కోరారు. 'వేల సంఖ్యలో బాధితులు, వందల సంఖ్యలో ఖైదీలుగా ఉన్నారు. యుద్ధం తక్షణం ఆగిపోవాలని మీరు ఎంత త్వర గా ప్రభుత్వానికి చెబితే..అంత ఎక్కువమంది బతుకుతారు'' అని జెలెన్స్కీ తాజా వీడియో సందేశంలో వెల్లడించారు.