Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పుల విరమణపై కుదరని రాజీ...మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకారం
- బెలారస్ సరిహద్దులో ఇరుదేశాల ప్రతినిధుల మధ్య నిర్ణయం
- భారతీయుల తరలింపు కోసం ఉక్రెయిన్ సరిహద్దుకు కేంద్ర మంత్రులు
- ఉక్రెయిన్-రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధం!
- ఉక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు అందజేస్తామని నాటో ప్రకటన
బెలారస్ సరిహద్దులో గోమెల్ వేదికగా సోమవారం జరిగిన ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నది. ఇరు దేశాల రక్షణమంత్రుల నేతృత్వంలో సుమారుగా 4గంటలపాటు చర్చలు సాగాయి. ఇరుపక్షాలు తమ తమ డిమాండ్లను వినిపించారు. సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలనీ, క్రిమియా నుంచి రష్యా తన సైనిక బలగాలను ఉపసంహరించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. నాటో కూటమిలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్ చేసింది. అయితే ఏ అంశంలోనూ ఇరు దేశాల మధ్య సానుకూలత వ్యక్తం కాలేదు. కాల్పుల విరమణపై రాజీ కుదరలేదు. దీంతో మరో సారి చర్చలు జరపడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. మరోవైపు అమెరికా, ఈయూ దేశాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు ప్రకటించాయి.
మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు నిరసనగా ఈయూ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించాయి. ఉక్రెయిన్‌లో చెర్నిహివ్‌లోని ఒక భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో భవనంలోని రెండు అంతస్థుల్లో మంటలు చెలరేగాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ సోమవారం నాటో నేతలతో సమావేశం కానున్నారు. ఈయూ దేశాలన్నీ తమ భూభాగంలో ల్యాండింగ్, టేకాఫ్, ఎగురుతున్న రష్యన్ విమానాలను నిషేధించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఆస్తుల నిర్వహణకు సంబంధించి కార్యకలాపాలను ఈయూ నిషేధించింది. ఐదోరోజు కీవ్, ఖార్వీవ్లలో పేలుళ్లు వినిపించాయని వార్తలు వెలువడ్డాయి. బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు మొదలవ్వడానికి ముందు జెలెన్స్కీ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యూరోపియన్ యూనియన్‌లో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కల్పించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయెన్కు ఆయుధ సాయం అందజేస్తామని నాటో దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడానని నాటో చీఫ్ జెన్స్ స్టోలెన్‌బర్గ్ తెలిపారు. ఆ దేశానికి అండగా ఉంటామని, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు క్షిపణులు, ఆయుధాలు సమకూరుస్తాయని అన్నారు. రష్యాలో తమ జాతీయులకు అమెరికా విదేశాంగశాఖ కీలక సూచన చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. రష్యా-ఉక్రెయిన్ దేశాలు తక్షణమే కాల్పులు విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ పిలుపునిచ్చింది. ఇరుపక్షాలు సంయమనం పాటించి, చర్చలు ప్రారంభించాలని సూచించింది. సంక్షోభం నేపథ్యంలో ఐరాస సాధారణ సభ 11వ అత్యవసర సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది.
శరణార్థులు ఐదు లక్షల మందికి పైనే
రష్యన్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను రెట్టింపు స్థాయికి అంటే 20 శాతానికి పెంచిందని ఎఎఫ్‌పి వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఘర్షణలో ఇంతవరకు దాదాపు 200 మంది దాకా మరణించారని, అయిదు లక్షల మంది శరణార్థులుగా మారారని ఐరాస శరణార్థి సంస్థ సోమవారం తెలిపింది. రష్యా, ఉక్రెయిన్ ఘర్షణల్లో గత నాలుగురోజుల్లో ఏడుగురు పిల్లలతో సహా 102 మంది పౌరులు మరణించారని, 300 మందికిపైగా గాయపడ్డారని ఐరాస మానవ హక్కుల కమిషన్ చీఫ్ మిచెల్ బెచెలెట్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఆదివారం తన అణు దళాలను సన్నద్ధంగా ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. బెలారస్లో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. సిబ్బందిని రష్యాకు వెళ్లేందుకు అనుమతించింది.
ఉక్రెయిన్‌కి కేంద్ర మంత్రులు
స్వదేశానికి భారతీయులను రప్పించే ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దులకు పంపాలని నిర్ణయించారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మోడీ ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు, పౌరుల తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. విద్యార్థులను తరలిస్తున్న సరిహద్దులకు కేంద్ర మంత్రులు కూడా వెళితే బాగుంటుందని, అక్కడుండే పరిస్థితులను సమీక్షించడం మంచిదని అభిప్రాయాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో..జ్యోతిరాదిత్య సింధియా రొమేనియా, మోల్డోవా వైపు చూస్తారు. కిరణ్ రిజిజు స్లోవేకియా వెళ్లనున్నారు. హర్దీప్ సింగ్ పూరీ హంగేరీ వెళ్లనున్నారు. వి.కె సింగ్ పోలాండ్‌లో వెళ్తారు. ఆపరేషన్ గంగా పేరుతో ఢిల్లీ, ముంబై నుంచి వెళుతున్న ప్రత్యేక విమానాల్లో కేంద్ర మంత్రులు వెళ్లాలని మోడీ ఆదేశించారట. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు నివేదికను ప్రధాని కార్యాలయానికి అందజేయాలని సూచించారట. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, పౌర విమానయాన మంత్రి జ్యోతి రాదిత్య సింధియా, న్యాయ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. భారతీయులను తరలించేందుకు ఇండిగో కూడా ఆపరేషన్ గంగాలో చేరనుంది.
స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతలవారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. మొత్తం 14మంది తెలంగాణకు చెందినవారు సోమవారం ప్రత్యేక విమానాలలో రుమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ వారికి తెలంగాణ భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు, ఇతర సహాయ సహకారాలు అందించారు.
విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా తెలంగాణ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీకి చెందిన మొత్తం 11 మంది ప్రత్యేక విమానాలలో రొమేనియా రాజధాని బుకరెస్ట్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. మొన్న కొందరు విద్యార్థులు భారత్‌కు చేరుకున్న సంగతి తెల్సిందే!