Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్బన్ ఉద్గారాలను భారత్ తగ్గించాలి..లేదంటే
- ఆహార దిగుబడులూ పడిపోతాయి..
- పర్యావరణ ముప్పు తీవ్రరూపం దాల్చుతోంది : ఐరాస నివేదిక
న్యూయార్క్ : కార్బన్ ఉద్గారాలు ఇదేవిధంగా ఉంటే..భారత్‌లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూతాపాన్ని (వాతావరణం వేడెక్కటం) అడ్డుకోకపోతే ముందు ముందు పరిణామాలు దారుణంగా ఉంటాయని, తిరిగి పూర్వపు పరిస్థితులకు వెళ్లటం అసాధ్యమని తాజా నివేదికలో ఐరాస పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ తాజా నివేదికలో పై విషయాలు పేర్కొన్నారు. దాంట్లో భారత్‌కు సంబంధించి మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. కార్బన్ ఉద్గారాల్ని భారత్ అడ్డుకోకపోతే, వాతావరణంలో అత్యధిక ఊష్టం, తేమ నెలకొంటుంది. వాతావరణం ప్రజలు భరించశక్యం కానంత స్థాయికి చేరుకుంటుంది. అంతేగాక, ఆహార ఉత్పత్తుల దిగుబడిని భారీఎత్తున తగ్గిస్తుందని నివేదిక తెలిపింది. ఒక్క డిగ్రీ సెల్సీయస్ నుంచి నాలుగు డిగ్రీల సెల్సీయస్ పెరిగితే, భారత్‌లో వరి దిగుబడి 10 శాతం నుంచి 30శాతం వరకు, మొక్కజొన్న 25శాతం నుంచి 70శాతం వరకు తగ్గుతుందని నివేదిక అంచనావేసింది.
మొత్తం జీవరాశిపై ప్రభావం
రాబోయే రెండు దశాబ్దాల్లో భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 సెల్సీయస్ పెరగనున్నది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. స్వల్పకాలికంగానూ తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయి. వీటిని మార్చలేం. తాత్కాలికంగా వచ్చే మార్పులు కొనసాగుతాయి. ఇదంతా కూడా ప్రపంచ మానవాళిపై, జంతువులపై, మొత్తం జీవరాశిపై ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో వచ్చే అనూహ్యమైన మార్పులు ఈ జీవరాశి ఎదుర్కోవాల్సి వుంటుంది. ఉదాహరణకు 2010-20 మధ్యకాలంలో భారీ వర్షాలు, వరదలు, కరువులు, తుఫాన్ల కారణంగా మరణాల సంఖ్య 15రెట్లు పెరిగింది. ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ, మధ్య అమెరికాలో మరణాలరేటు ఎక్కువగా ఉంది. ''ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు, పని ప్రదేశాలు మారిపోతాయి. ఇతర జంతుజీవజాలంతో కలిసి మనిషి ఈ ప్రపంచంలో బతుకుతున్నాడు. దీనిని పర్యావరణ మార్పులు అల్లకల్లోలం చేస్తాయి'' అని నివేదిక రూపకల్పనలో పాల్గొన్న డెబ్రా రాబర్ట్స్ అన్నారు. భారత్ విషయానికొస్తే, కోస్తాతీర ప్రాంతాల్లో 3.5కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. కార్బన్ ఉద్గారాలు ఇదే విధంగా పెరుగుతూ పోతుంటే..భూమి వేగంగా వేడెక్కుతుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే 87.7కోట్లమందికి ప్రమాదం పొంచివుందని రచయిత అంజల్ ప్రకాశ్ చెప్పారు. జనాభా ఎక్కువగా ఉన్న నగరాలపై పర్యావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు.