Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖార్కీవ్ నుంచి వెంటనే వెళ్లిపోండి..
- విద్యార్థులకు భారత్ ఎంబసీ సూచన
- బస్సు, రైలు కోసం వేచిచూడొద్దు..
- కాలినడకన సరిహద్దులకు చేరుకోవాలని సందేశం
- పుతిన్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
''ఖార్కీవ్లో మేం తలదాచుకున్న చోట పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కాలేజీ హాస్టల్ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను. బాంబు పేలుళ్ల మోతతో చెవులు దద్దరిల్లిపోతున్నాయి. మేం ఉంటున్న భవనం కంపిస్తోంది. మమ్మల్ని కాపాడేవారు ఉన్నారా? అనే అనుమానాలతో, భయంతో బతుకుతున్నా''మని 22ఏండ్ల సౌమ్య థామస్ సామాజిక మాధ్యమంలో సందేశాన్ని పోస్ట్ చేసింది. ఆమె ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. ఉక్రెయిన్‌లో భారతీయుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఈ సందేశం తెలుపుతోంది.
కీవ్ : ఉక్రెయిన్‌లో వేలాది మంది భారతీయ విద్యార్థుల కష్టాలు మరింతగా పెరిగాయి. ముఖ్య పట్టణాలపై రష్యా సేనల భీకర దాడులు భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఖార్కీవ్ నగరంలో భారతీయులకు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో అత్యవసర మార్గదర్శకాలను జారీచేసింది. రష్యా బలగాలు యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తున్న నేపథ్యంలో..ఖార్కీవ్ను వెంటనే విడిచి వెళ్లిపోవాలని, ఉన్నఫళంగా కాలినడకన పోలండ్, హంగేరీ, స్లోవేకియా, రొమేనియా సరిహద్దులకు చేరుకోవాలని బుధవారం భారత ఎంబసీ మార్గదర్శకాలు జారీచేసింది. నగరానికి పడమర, వాయువ్య ప్రాంతాలకు వెళ్లిపోవాలని తెలిపింది. పెసోచిన్, బాబే, బెజ్లియుడోవ్కాకు వీలైనంత త్వరగా చేరుకోవాలని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6గంటలకల్లా సూచించిన ప్రాంతాలకు చేరుకోవాలని పేర్కొన్నది. అంతకుముందు పోలాండ్లోని భారత రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర మార్గదర్శకాలు జారీచేసింది. బుడోమియర్జ్ సరిహద్దుకు వీలైనంత త్వరగా చేరుకొని పోలాండ్లోకి ప్రవేశించాలని వారిని కోరింది.
రష్యా మీదుగా తరలించే ఏర్పాట్లు
ఖార్కీవ్లో రష్యా దాడుల నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూ ప్రకటించారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు మొత్తం 12గంటలపాటు కర్ఫ్యూ కొనసాగుతుం దని అధికారులు నిర్ణయించారని అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్రమోడీ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. అక్కడ చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా తరలించేం దుకు సహకరించాలని కోరారని తెలిసింది. భారతీయ విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖార్కీవ్ను స్వాధీనం చేసుకునేందుకు మరికొద్ది గంటల్లో రష్యా పెద్ద ఎత్తున ఆయుధా ల్ని ప్రయోగించే అవకాశముందని వార్తలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ను ఇప్పటివరకు దాదాపు 17వేల మంది భారత పౌరులు వీడినట్టు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఆరు విమానాలు భారత్‌కు వచ్చాయనీ, మరో 24గంటల్లో 15విమానాలు రాబోతున్నాయని చెప్పారు. ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 3352మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు.
భారత్ ముందే మేల్కోవాల్సింది : సౌమ్య థామస్, మెడిసిన్ విద్యార్థి
గత శనివారం నుంచి ఖార్కీవ్పై రష్యా సైనిక బలగాల దాడులు ఉధృతమయ్యాయి. పేలుళ్ల ధాటికి పెద్ద పెద్ద చెట్లు, భవనాలు కూలుతున్నాయి. అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఆ రోజు రాత్రి మా వద్ద తాగటానికి కనీసం నీళ్లు కూడా లేవు. అందుకే కొంతమంది విద్యార్థులు సూపర్ మార్కెట్‌కు వెళ్లాలని, బంకర్ నుంచి బయటకు వచ్చారు. అప్పుడు బయట మొత్తం చీకటి. పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. బయటకు వెళ్లినవారికి ఏమీ దొరకలేదు. ఓ తాగునీటి పైప్ వద్ద నీరు తాగి కడుపు నింపుకున్నాం. పరిస్థితి ఇంతదాకా రాకముందే భారత ప్రభుత్వం మేల్కోవాల్సింది.