Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రష్యాకు వ్యతిరేకంగా 141... అనుకూలంగా 5 ఓట్లు
- భారతదేశం సహా 35 దేశాలు ఓటింగ్‌కు దూరం
- ఏడో రోజూ బాంబుల మోత
మాస్కో : ఉక్రెయిన్‌పై రష్యా దాడి బుధవారం ఏడో రోజు కొనసాగుతోంది. ఖార్కివ్‌తో సహా అనేక ప్రధాన నగరాల్లో ఎడతెరిపిలేనివిధంగా దాడులు జరుగుతున్నాయి. 24 గంటల్లో 21 మంది మృతి చెందగా, 112 మంది గాయపడ్డారు రష్యన్ పారాట్రూపర్లు ఖార్కివ్‌లోని ఆస్పత్రిపై దాడి చేశారు. అదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇప్పటివరకు యుద్ధంలో సుమారు 6000 మంది రష్యన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్...
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో బుధవారం రాత్రి రష్యాపై అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ప్రతిపాదనకు అనుకూలంగా 141 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 5 ఓట్లు వచ్చాయి. భారత్ సహా 35 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. రష్యాకు అనుకూలంగా ఓటు వేసిన దేశాలు రష్యా, బెలారస్, ఉత్తర కొరియా, ఎరిట్రియా , సిరియా ఉన్నాయి. హాజరు కానివారిలో భారతదేశం, చైనా, పాకిస్తాన్, ఇరాక్ ,ఇరాన్ ఉన్నాయి.
మరోవైపు, ఉక్రెయిన్.. రష్యాల మధ్య త్వరలో పోలాండ్‌లో చర్చలు ప్రారంభమవుతాయి. ఇరు దేశాల ప్రతినిధులు సభా వేదిక వద్దకు బయల్దేరి వెళ్లారు. యుద్ధంలో తమ సైనికులలో 498 మంది మరణించారనీ, దాదాపు 1500 మంది ఖైదీలుగా ఉన్నారని రష్యా మొదటిసారి అంగీకరించింది.
ఇక ఉక్రెయిన్ నుంచి ఆరులక్షల మందికి పైగా శరణార్థులు పలు మార్గాల్లో ఇతర ప్రాంతాలకు చేరుకున్నారని సమాచారం. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత అక్కడి పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న పోలాండ్, హంగరీ, మోల్డోవా, రొమేనియా, స్లోవేకియా , బెలారస్లలో ఎక్కువ వలసలు జరిగాయి.