Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పుల విరమణ, మానవతా సహాయం..మా ఎజెండా : ఉక్రెయిన్
- మా డిమాండ్లలో మార్పు లేదు : రష్యా
- ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండాలి : పుతిన్
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఇప్పటికే ఎనిమిది రోజులు గడిచింది. సమస్య పరిష్కారం దిశగా వెళ్లాలని, శాంతి చర్చలు ఫలించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గురువారం రాత్రి బెలారస్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. తమ డిమాండ్లు ఇంతకు ముందే స్పష్టంగా చెప్పాం..వాటిని ఒప్పుకుంటేనే సైనిక చర్య ఆగుతుందని రష్యా మరోమారు స్పష్టం చేసింది. స్వతంత్ర ప్రాంతాలుగా ఏర్పడ్డ డోనెస్క్, లూహాన్స్క్‌లను రష్యా వదిలేయాలని, కాల్పుల విరమణ ప్రకటించాలని ఉక్రెయిన్ కోరుతోంది. ఉక్రెయిన్ బృందంలో సభ్యుడైన స్థానిక ప్రజాప్రతినిధి డేవిడ్ అరాఖమియా మాట్లాడుతూ, చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌లో మానవతా సహాయ చర్యల కోసం 'హ్యుమానిటేరియన్ కారిడార్'ల ఏర్పాటుపై ఒప్పందం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.
ఫిబ్రవరి 28న బెలారస్లో ఇరు దేశాల మధ్య సుమారు 4గంటలపాటు శాంతి చర్చలు జరిగాయి. అయితే ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమయ్యాయి. దాంతో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య రెండో విడత చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రస్తుత యుద్ధ పరిస్థితులను ముగించడంతోపాటు డాన్‌బాస్‌లో శాంతిని పునరుద్ధరిస్తుందని ఆశిస్తున్నట్టు రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఉక్రెయిన్‌లోని ప్రజలందరూ శాంతియుత జీవనానికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇరు దేశాల బృందాలు చర్చలు వెళ్లే ముందు అక్కడి స్థానిక మీడియాతో మాట్లాడారు. చర్చలు మరికొద్ది గంటల్లో ప్రారంభం అవుతున్నాయని, ఇందులో ప్రస్తావించే అంశాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మిఖాయిలో పోడోలిక్ ట్విట్టర్లో తెలిపారు. ఇదిలా ఉండగా, గురువారం అణు స్థావరాల భద్రతపై చైనా ఉక్రెయిన్, రష్యాలకు సూచన చేసింది. అణు స్థావరాలకు ఎలాంటి ముప్పువాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
అబ్బే లాభం లేదు : ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
ముందు ముందు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గంటన్నరపాటు ఫోన్ సంభాషణ అనంతరం మేక్రాన్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగించే ఉద్దేశాన్ని పుతిన్ కనబర్చారని, తమ డిమాండ్లకు తలొగ్గితేనే మిలటరీ ఆపరేషన్ ముగుస్తుందని పుతిన్ చెప్పటం తనను ఆందోళనకు గురిచేసిందని మేక్రాన్ అన్నారు.
లక్ష్యాన్ని పూర్తిచేస్తాం : పుతిన్
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య పతాకస్థాయికి చేరుకున్నవేళ..రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు మిలటరీ అనేది లేకుండా (నిస్సైనికీరణ) చేయటమే తమ లక్ష్యమని, తటస్థ దేశంగా నిలపటమే తమ మిలటరీ ఆపరేషన్ లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చెప్పారు. మేక్రాన్-పుతిన్ మధ్య గురువారం దాదాపు 90 నిమిషాలపాటు ఫోన్ సంభాషణలు జరిగాయి. చర్చలకు రాకుండా తాత్సారం చేస్తే..రష్యా డిమాండ్స్ మరింత పెరుగుతాయని పుతిన్ హెచ్చరించారు. మరోవైపు యరోపియన్ సమాఖ్య రష్యాపై ఆంక్షల తాకిడిని ఉధృతం చేసింది. తాజాగా రష్యాకు చెందిన ప్రముఖ వార్తా ఛానల్ 'ఆర్టీ' ప్రసారాల్ని నిలిపివేస్తున్నామని బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో అత్యంత ముఖ్య నగరం ఖేర్సాన్ను రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సైనిక చర్య ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్‌లో కీలక నగరం రష్యావశం కావటం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరటానికి ఉబలాడపడుతోంది. ఇదే రష్యా ఆగ్రహానికి ప్రధాన కారణం. సైనిక చర్య ద్వారా మాత్రమే ఉక్రెయిన్ను దారిలోకితేగలమని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉక్రెయిన్‌లోని ప్రధాన మిలటరీ స్థావరాలపై క్షిపణులు, ఫిరంగులతో రష్యా దాడులు చేస్తోంది. అయితే ఉక్రెయిన్ సేనలు గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి.