Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరుల తరలింపు కోసం : రష్యా ప్రకటన
- ఖార్కీవ్, సుమీ నగరాల్లో చిక్కుకున్న భారతీయులు
- మార్గాలను అన్వేషిస్తున్నామన్న భారత ఎంబసీ
రెండు నగరాల్లో పౌరుల తరలింపునకు అనుగుణంగా రష్యా శనివారం తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ముఖ్యంగా భారత పౌరులను సురక్షితంగా పంపేందుకు సహకరిస్తామని ప్రత్యేకంగా పేర్కొన్నది. అయితే అక్కడున్న భారతీయులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. తీవ్రమైన చలి, ఆకలిని తట్టుకుంటూ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సుమీ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న దాదాపు 700మంది సాయం చేయాలంటూ భారత ఎంబసీకి పదే పదే వీడియో సందేశాలు పంపారు.
కీవ్ : మరియూపోల్, వోల్నోవాకా నగరాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది. సాధారణ పౌరులు బయటకు వెళ్లటానికి వీలుగా మానవతావాద నడవ (కారిడార్)ను తెరుస్తున్నామని రష్యా రక్షణమంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితికి తెలిపింది. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల నుంచి విద్యుత్, తాగునీరు, ఆహారం, హీటింగ్, రవాణా సదుపాయాలు.. స్తంభించిపోయాయి. రష్యా తీసుకున్న తాజా నిర్ణయం అక్కడి పౌరులకు కొంత ఊరటనిచ్చింది. ఇదిలా ఉండగా ఖార్కీవ్, సుమీ ప్రాంతాల్లో భారతీయులు పెద్ద ఎత్తున చిక్కుకుపోయారని, వారిని తరలించేందుకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయని శనివారం వార్తలు వెలువడ్డాయి.
రష్యా సరిహద్దుకు కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ సుమీ ప్రాంతం. ఇక్కడ కూడా కాల్పుల విరమణ ప్రకటించాలని భారత ఎంబసీ అధికారులు రష్యాను కోరుతున్నారు. అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులు.. తమ దుస్థితిపై సోషల్‌మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎవరూ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఖార్కీవ్, సుమీలో భారతీయులు, ఇతర విదేశీయులను తరలించడానికి రష్యన్ బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధం ఉన్నాయని ఐరాస భద్రతా మండలికి రష్యా తెలియజేసింది. కాగా..ఖార్కీవ్, సుమీ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు రిస్క్ తీసుకోవద్దని భారత ఎంబసీ అధికారులు మరోమారు తెలిపారు. పౌరుల తరలింపునకు సహకరించాలని ఉక్రెయిన్, రష్యాలపై ఒత్తిడి చేస్తున్నామని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విట్టర్లో తెలిపారు. షెల్టర్లలోనే ఉండాలని విద్యార్థులకు సూచించారు.
చిక్కుల్లో వెయ్యిమంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరకటం లేదు. ముఖ్యంగా అక్కడ చిక్కుకున్న విద్యార్థులు ఎంతో ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ..సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాము ఎక్కడుందీ.. తెలియజేస్తూ భారత ఎంబసీకి సందేశాలు, వీడియోలు పంపుతున్నారు. ఖార్కీవ్, సుమీలో దాదాపు వెయ్యిమంది భారతీయులు చిక్కుకుపోయారని సమాచారం. వారిని సురక్షితంగా తరలించేందుకు పలు అడ్డంకులు ఉన్నాయని, ప్రత్యామ్నాయ మార్గాలని అన్వేషిస్తున్నట్టు ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం తెలిపింది. రెడ్‌క్రాస్‌తో సహా సంబంధిత అన్ని వర్గాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని భారత ఎంబసీ ట్విట్టర్లో తెలిపింది.