Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుమీలో విద్యార్థులు రిస్క్ తీసుకోవద్దు..
- అక్కడ కాల్పుల విరమణ ప్రకటిస్తేనే.. తరలింపు సాధ్యం : భారత ఎంబసీ
- సరిహద్దుకు చేరలేకపోతున్న విద్యార్థులు
కీవ్ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందవద్దని..వారిని సురక్షితంగా తరలిస్తామని భారత ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. పిసోచైన్, ఖార్కీవ్, సుమీలలో చిక్కుకుపోయిన ప్రతి విద్యార్థినీ భారత్‌కు తీసుకువస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ ఆదివారం తెలిపారు. ''ఖార్కీవ్లో దాదాపు విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఫోకస్ అంతా సుమీపైన్నే ఉంది. ఇక్కడ కాల్పుల విరమణ ప్రకటించకుండా విద్యార్థుల తరలింపు అసాధ్యం. దీని గురించి ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడుతున్నాం. సుమీలో విద్యార్థులు బంకర్లు దాటి రావొద్దు. మరికొన్ని గంటలు ఓపికపట్టాలి'' అని అన్నారు.
హంగేరీలో మిషన్ ముగింపు!
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను 'ఆపరేషన్ గంగ' ప్రత్యేక మిషన్ ద్వారా సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు. అయితే హంగేరీలో ఈ ప్రత్యేక మిషన్ ముగింపు దశకు చేరుకుందని, చివరి విమానాలు ఆదివారం రాత్రి బయల్దేరుతున్నాయని అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. స్థానికంగా ఎంబసీ ఏర్పాటుచేసిన బస కాకుండా స్వతహాగా వేర్వేరు చోట్ల ఉన్నవారందరూ వెంటనే బుడాపెస్ట్‌కు చేరుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం ఆదివారం కీలక సూచనలు జారీచేసింది. పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, ఏ నగరంలో ఉన్నారు? తదితర వివరాలు అందుబాటులో ఉంచిన దరఖాస్తులో నింపాలని సూచించింది. ఈమేరకు ఓ గూగుల్ డాక్యుమెంట్‌ను జతపర్చింది.
10రోజులుగా బంకర్లోనే
సుమీ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, ఇతర భారతీయులు సుమారుగా 700మంది వర్సిటీ హాస్టల్ దగ్గరున్న బంకర్లలో తలదాచుకున్నారు. వీరు అక్కడ చిక్కుకుపోయిన 10 రోజులు అవుతోంది. బస్సులు, ఇతర వాహనాలు అక్కడికి వెళ్లకుండా రహదార్లన్నీ మూతపడ్డాయి. దాంతో విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారింది.