Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ/కీవ్/వాషింగ్టన్ : ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోవాలంటూ భారత్‌పై అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టు దౌత్యరంగ నిపుణులు తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానంపై ఓటు వేసేందుకు భారత్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఐరాస మానవ హక్కుల సంస్థ నిర్వహించిన సమావేశానికి కూడా భారత్ గైర్హాజరైంది. ఈ నేపథ్యంలో నిర్ధిష్టమైన వైఖరి తీసుకోవాలని, రష్యా దాడిని ఖండించాలంటూ భారత్‌పై వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతోందని అమెరికా సీనియర్ దౌత్యవేత్త డొనాల్డ్ లూ తెలిపారు. భారత రక్షణ దిగుమతుల్లో 50 శాతం పైగా రష్యా నుంచే వస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటు అమెరికాకు జూనియర్ భాగస్వామిగా కొనసాగుతున్నందున ఇటు రష్యాను, అటు నాటోను కాదనలేక భారత్ తటస్ట వైఖరి కొనసాగిస్తోంది. ఈ వైఖరిని మార్చుకొని రష్యా తీరును ఖండించాలన్నది అమెరికా డిమాండ్. ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు రామ్ మాధవ్ ఇటీవల ఓ పత్రికలో రాసిన వ్యాసంలో 'భారత్ తన తటస్ఠ వైఖరిని ఎంతకాలం కొనసాగిస్తో చూడాలి' అని పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిగజారే ప్రమాదం : ఐఎంఎఫ్
ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ఒక ప్రకటనలో హెచ్చరించింది. ప్రస్తుతమున్న ద్రవ్యోల్బణానికి తోడు ఇంధనం, వస్తువుల ధరలు పెరిగిపోయాయని వెల్లడించింది. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు కూడా విపరీత పరిణామాలకు దారితీస్తాయని, ఉక్రెయిన్‌తో సన్నిహిత ఆర్థిక సంబంధాలున్న దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది.
విదేశీయులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం : రష్యా
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న సామాన్య ప్రజలను, విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రష్యా ఆదివారం నాడు మరోసారి పునరుద్ఘాటించింది. ప్రధానంగా మారియుపోల్, వోల్నోవాఖాలలో మానవతా కారిడార్లు ఏర్పాటు చేసి సహాయం అందించేందుకు నిత్యం కృషి చేస్తున్నామని రషా నేషనల్ సెంటర్ ఫర్ స్టేట్ డిఫెన్స్ కంట్రోల్ అధిపతి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్ తెలిపారు. అయితే పౌరుల తరలింపు చర్యలను ఉక్రెయిన్ బలగాలు అడ్డుకుంటున్నాయని తప్పుబట్టారు. ఆదివారం కూడా పలుచోట్ల కొన్ని గంటల పాటు కాల్పుల విరమణ పాటించి పౌరుల తరలింపునకు రష్యా చర్యలు చేపట్టినట్లు కథనాలొచ్చాయి.
సెర్బియాలో రష్యాకు మద్దతుగా ర్యాలీలు
రష్యాకు మద్దతుగా సెర్బియా రాజధాని బెలెగ్రేడ్లో వేలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. బెలారస్లో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. 'ఇది మానవాళిని కాపాడే ప్రయత్నం. మానవాళిని రష్యా కాపాడుతోంది. సంప్రదాయాలు, నాగరికతకు మద్దతుగా నిలుస్తోంది. ఇది మంచి, చెడులకు మధ్య జరుగుతున్న యుద్ధం. దేవుడి దయతో రష్యా గెలుస్తుంది. మా సోదరులకు మద్దతుగా మేము ర్యాలీ నిర్వహిస్తున్నాం. రష్యన్లకు మేము మద్దతు తెలియజేస్తున్నాం' అని ర్యాలీలో పాల్గొన్న ఒక వృద్ధుడు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కాగా యుద్ధం వద్దు..శాంతిపథమే ముద్దు అంటూ రష్యాలోనూ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించినట్లు కథనాలు వెలువడ్డాయి.