Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పశ్చిమ దేశాలను కోరిన జెలెన్స్కీ
- పోలండ్ సహకరిస్తే ఉక్రెయిన్‌కు ఎఫ్-16 విమానాలు: అమెరికా
- యుద్ధ విమానాలు పంపేందుకు ఈయూ తిరస్కృతి
కీవ్/మాస్కో/ వాషింగ్టన్: రష్యాతో తలపడుతున్న తమకు యుద్ధ విమానాలు, ఆయుధాలు, డబ్బు అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమ దేశాలను అభ్యర్థించారు. పోలండ్ సహకరిస్తే ఉక్రెయిన్‌కు తన ఎఫ్-16 పోరాట విమానాలను, ఆయుధాలను పంపనున్నట్లు వైట్ హౌస్ కోరింది. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు ఇచ్చి సహకరించాలని యూరప్ దేశాలకు అమెరికా సూచించింది. సోవియట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు పోలండ్ సరఫరా చేస్తే ఆ దేశానికి ఎఫ్-16 రకం యుద్ధ విమానాలు అందించేందుకు తాము సిద్ధమని వైట్ హౌస్ ప్రతినిధి ఒకరు శనివారం తెలిపారు. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపేందుకు పోలండ్, బల్గేరియా తిరస్కరించాయి. ఉక్రెయిన్ గగన తలంలోకి తమ యుద్ధ విమానాలను పంపే ప్రసక్తే లేదని పోలండ్ తేల్చి చెప్పింది. అయితే, ఉక్రెయిన్ నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడం వంటి మానవతా సాయం అందించడానికి తాము సిద్ధమేనని పోలండ్ అధ్యక్షుడు దుదూ తెలిపారు. అమెరికా విజ్ఞప్తిపై యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖెల్ స్పందిస్తూ, ఉక్రెయిన్‌కు తాము అందిస్తామన్న మిలిటరీ సాయంలో జెట్ విమానాలను చేర్చబోవడం లేదన్నారు. 'రష్యాతో యూరోపియన్ యూనియన్ కచ్చితంగా యుద్ధం చేయదు. ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌కు దగ్గరగా ఉంటుంది. మంచి మిత్ర దేశం. అందుకే మేం అన్ని స్థాయిల్లో మద్దతిస్తున్నాం' అని మైఖెల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్ 50 కోట్ల యూరోల నగదు సాయం, 45 కోట్ల యూరోల మిలిటరీ సాయం అందించాలని ఇయు ఉన్నత రాజకీయ మండలి నిర్ణయించింది. అయితే ఈ సాయాన్ని ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించరాదని షరతు విధించింది. అంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇయు దేశాలకు చేసిన విజ్ఞప్తిలో ఉక్రెయిన్ గగన తలంలో నాట్లో ద్వారా నో ఫ్జైజోన్ను ఏర్పాటు చేయాలని కోరారు. నో ఫ్లై జోన్ గుండా రష్యన్ దళాలు వస్తే వాటిని షూట్ చేయాలని కోరారు. నో ఫ్జై జోన్ సాధ్యం కాకుంటే కనీసం యుద్ధ విమానాలైనా పంపమని కోరారు. ఉక్రెయిన్ను నిస్పైనికీకరణ, నాజీరహితంగా చేయడమే తమ సైనిక చర్య ఉద్దేశమని రష్యా అధ్యక్షుడు పుతిన్ పునరుద్ఘాటించారు. రష్యా సైనిక చర్యను నిలిపివేయాలంటే ఉక్రెయిన్ తాము పెట్టిన డిమాండ్లన్నిటినీ అంగీకరించాలని, డాన్బాస్, లుగాన్ష్క్, డాటెన్క్క్లపై మిలిటరీ యాక్షన్‌ను ఆపేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఆదివారం ఫోన్లో తెలిపారు.
బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం నాడు ఒక ప్రకటన చేస్తూ, ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఆరు సూత్రాల ప్రణాళిక ఒకటి సూచించారు. ఉక్రెయిన్‌లో ఘర్షణతో నాటోకు ప్రమేయం లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో నాటో దళాలు లేవన్నారు. ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం మరింత తోడ్పాటునందించాలని బ్రిటన్ ప్రధాని చెప్పారు. న్యూయార్క్‌టైమ్స్ ఆదివారం నాటి సంచికలో ప్రచురితమైన ఆయన వ్యాసంలో ఉక్రెయిన్ సంక్షోభానికి ఆరు సూత్రాల ప్రణాళికను సూచించారు.
చైనీస్ యూనియన్ పే వైపు షిఫ్ట్ అవుతున్నరష్యన్ బ్యాంకులు
అమెరికా, దాని మిత్ర దేశాల ఆర్థిక ఆంక్షల మూలంగా వీసా, మాస్టర్ కార్డులు రష్యా నుంచి ఉపసంహరించుకోవడంతో వాటి స్థానే చైనీస్ యూనియన్ పే కార్డులను జారీ చేయాలని రష్యన్ బ్యాంకులు తాజాగా నిర్ణయించాయి. ఈ కొత్త కార్డులను ఉపయోగించి విదేశాలలో నగదును తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ విధంగా షిఫ్టు అయిన వాటిలో అతిపెద్ద బ్యాంకులైన పొచా బ్యాంక్, గాజప్రామ్బ్యాంక్, ప్రామ్స్వియాజ్ బ్యాంక్, సోవ్కాంబ్యాంక్లతో బాటు ఇతర చిన్న చితక బ్యాంకులు కూడా ఉన్నాయి. చైనీస్ యూనియన్ పే బ్యాంక్ 2002లో షాంఘై కేంద్రంగా ఏర్పడింది. దీనికి 2005లో అంతర్జాతీయ ప్రతిపత్తి లభించింది.