Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీవ్ సహా ఐదు నగరాల్లో... సుమీ, ఇర్పిన్ల నుంచి పౌరుల తరలింపు ప్రారంభం
- 20లక్షలకు చేరుతున్న వలసలు
మాస్కో, కీవ్ : ముందుగా ప్రకటించినట్టుగా కీవ్ మరో నాలుగు నగరాల నుంచి ప్రజల తరలింపు కోసం రష్యా మానవతా కారిడార్లను తెరిచింది. రష్యా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10గంటల నుంచి కాల్పులు నిలిచిపోయాయని ఐక్యరాజ్య సమితిలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజిలాయ తెలిపారు. తరలింపు ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ తాజా ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి డిమాండ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. సురక్షితంగా ప్రజల తరలింపు జరిగితేనే రష్యా చెప్పే మాటలను నమ్మగలుగుతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడానికి అంగీకరించిన తర్వాత సుమీ, ఇర్పిన్ల నుంచి పౌరుల తరలింపును ఉక్రెయిన్ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. కీవ్, చెర్నిహివ్, ఖర్కీవ్, మరియుపోల్ నగరాల్లో ప్రస్తుతం మానవతా కారిడార్లు ఏర్పాటు చేశారు.
694 మంది భారత విద్యార్థుల తరలింపు ప్రక్రియ ప్రారంభం
సోమవారం రాత్రి సుమీ నుంచి 694మంది భారతీయ విద్యార్ధులు స్వదేశం చేరుకునే క్రమం ప్రారంభమైందని, వారందరూ ముందుగా పోల్టావా నగరానికి చేరుకున్నారని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ పూరి తెలిపారు.
షరతులు ఆమోదిస్తే దాడుల నిలిపివేతకు సిద్ధం : రష్యా
సోమవారం రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరిగిన మూడో దఫా చర్చలు తాత్కాలిక పురోగతిని సాధించినా మానవతా కారిడార్లను ఏర్పాటు చేయడంపై పూర్తి స్థాయి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమయ్యాయి. ఈ చర్చల్లో కొంత సానుకూల ఫలితాలు వచ్చాయని కీవ్ చెబుతుండగా, తామనుకున్న లక్ష్యాలు నెరవేరలేదని రష్యా పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న దాడులను నిలుపుచేయడానికి తాము సిద్ధంగా వున్నామని రష్యా మంగళవారం ఒక ప్రకటన చేసింది. దానికి ముందుగా డాంటెస్క్, లుహాన్స్క్ వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా గుర్తించడంతో సహా పలు షరతులను ఉక్రెయిన్ ఆమోదించాల్సి వుంటుందని రష్యా స్పష్టం చేసింది. మరోవైపు బుధవారానికల్లా ఉక్రెయిన్ శరణార్థుల సంఖ్య 20లక్షలకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ యుఎన్హెచ్సిఆర్ తెలిపింది.
రష్యా ఆస్తుల స్తంభన
రష్యాపై ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్ పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యన్ సెంట్రల్ బ్యాంక్తోసహా మరో ఏడు బ్యాంకుల లావాదేవీలను దక్షిణకొరియా నిలిపివేసింది. కొరియా రిపబ్లిక్లో వున్న రష్యా ఆస్తులను స్తంభింపచేసింది. జపాన్ 32కి పైగా రష్యన్, బెలారస్ అధికారుల, సంపన్నుల ఆస్తులను స్తంభింపచేసిందని జపాన్ ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటించింది. రష్యాకి జరిపే ఎగుమతులపైనా నిషేధం విధించింది.
చమురు డిపోలపై వైమానిక దాడులు
రెండు నగరాల్లోని చమురు డిపోలపై రష్యా వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పది క్యూబిక్ మీటర్ల చమురు వున్న డిపోలో మంటలు చెలరేగినట్లు ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం తెలిపింది. మరో ప్రాంతంలో రెండు ట్యాంకులకు నిప్పంటిం చారని, దీంతో సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. సుమీలో బాంబు దాడుల్లో తొమ్మిది మంది మర ణించగా, పలువురు గాయపడ్డారు. మరణించిన వారిలో ఇద్దరు పిల్లలున్నారు. రష్యా సరిహద్దుకు సమీపంలో వుండే ఈ నగరంలో గతకొద్ది రోజులుగా భారీగా బాంబుదాడులు జరుగుతున్నాయి. రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 143మంది ఉక్రెయిన్ పౌరులు మరణించారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపింది. తాజాగా సోమవారం 10మంది పౌరులు చనిపోయారు.
యుద్ధ నేరాలకు రష్యాను బాధ్యురాలిగా చేస్తాం : ఉక్రెయిన్
రష్యాను యుద్ధనేరాలకు బాధ్యురాలిగా చేసేందుకు పలు అంతర్జాతీయ న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా తెలిపారు. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయ స్థానం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, యూరప్ మానవ హక్కుల కోర్టు తదితర వేదికలపై విచారిస్తున్న కేసులపైనే చర్చలను కేంద్రీకరించామని చెప్పారు. ఖర్కీవ్ నగరంలోని అణు పరిశోధనా కేంద్రంపై శతఘ్ని గుళ్ల వర్షం కురిసిందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. ఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని పేర్కొంది. ఉక్రెయిన్‌కు 48.9 కోట్ల డాలర్ల ప్యాకేజీకి ప్రపంచబ్యాంక్ ఆమోదం తెలిపింది.